ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి /ఏలూరు, ఏప్రిల్, 8 : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబాబునాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆగిరిపల్లిలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈనెల 11వ తేదీ అగిరిపల్లి లో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. ఈ నెల 11 వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రాష్ట్రస్థాయి ఉత్సవాలను ఆగిరిపల్లిలో నిర్వహించడం జరుగుతుందని, సదరు కార్యక్రమాలలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొంటారన్నారు. బలహీనవర్గాల పనిస్థలం వద్దకు వెళ్లి వారి సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి జీవనోపాధికి, వారి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రతిబింబించేవిధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. చేతివృత్తులు చేసుకునే శాలివాహనులు , రజకులు వంటి బలహీనవర్గాలకు వారికి అవసరమైన పనిముట్లు అందించడంతోపాటు, వారి సమస్యలను తెలుసుకుని వారి ఆర్థికాభివృద్ధికి రుణాలు అందచేస్తారన్నారు. నియోజకవర్గంలో సమస్యలను రాష్ట్రముఖ్యమంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పార్థసారథి చెప్పారు.
ఈ సందర్భంగా అగిరిపల్లి శివారు వడ్లమానులో హెలిప్యాడు,మరియు బహిరంగ సభకు సంబందించిన అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్ కు ప్రతిపాదించిన స్థలంలో హెలికాప్టర్ లాండింగ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని, పరిసర ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా ఉండేలా స్థలాన్ని గుర్తించాలన్నారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య ననుసరించి అంత సామర్ధ్యం కలిగిన ప్రదేశాన్ని గుర్తించాలన్నారు. వేసవి దృష్ట్యా బహిరంగ సభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, టెంట్లు, కుర్చీలు, వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. హెలీప్యాడ్ , బహిరంగ సభ ల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ ,బి,స్మరణ్ రాజ్, తహసీల్దార్ ప్రసాద్, , ఎంపిడిఓ,వేణు, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీరామకృష్ణ, శ్రీనివాసు,ఎ, సతీష్, గణేష్,నాని, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు,తదితరులు, పాల్గొన్నారు.