Close

‘మొంథా’ పెను తుఫాన్‌ ఈనెల 28వ తేదీ రాత్రిలోగా మచిలీపట్టణం- కళింగపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని

Publish Date : 27/10/2025

ఏలూరు, అక్టోబర్, 27 : ‘మొంథా’ పెను తుఫాన్‌ ఈనెల 28వ తేదీ రాత్రిలోగా మచిలీపట్టణం- కళింగపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఆ సమయంలో తీవ్రమైన వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు తుఫాన్ పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం తీసుకున్న తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలను పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ లతో కలిసి తెలియజేసారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకున్నదన్నారు. ముంపు ప్రాంతాలలోని ప్రజలను తరలించేందుకు 82 తుఫాన్ సహాయక కేంద్రాలను గుర్తించడం జరిగిందని, వాటిలో కలిదిండి లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి 42 కుటుంబాలను తరలించడం జరిగిందన్నారు. జిల్లాలో 301 మైనర్ ఇరిగేషన్ చెరువులు సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగిందని, వాటిలో 129 మైనర్ ఇరిగేషన్ చెరువులు ప్రమాదకరమైనవిగా గుర్తించడం జరిగిందన్నారు. వీటి వద్ద సిబ్బందిని ఏర్పాటుచేసి, ప్రమాదానికి మించి నీటి ప్రవాహం వస్తే గండి కోట్లే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా జిలాల్లో 763 హోర్డింగ్లు తొలగించడం జరిగిందన్నారు. తుఫాన్ ముంపు గ్రామాలలో 100 మంది గజఈతగాళ్లను సిద్ధం చేశామని, 123 మంది గర్భిణీలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. 11 లంక గ్రామంలో ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. కల్వర్టులు, కాజ్ వే ల వద్ద రెవిన్యూ, పోలీస్ సిబ్బందిని పహారా ఉంచామన్నారు. తుఫాన్ సమయంలో చెట్లు కూలిపోయిన కారణంగా రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ఉండేలా చెట్లు తొలగించేందుకు చెట్లు కట్ చేసే యంత్రాలు, జెసిబి లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిలాల్లో శిధిలావస్థలో ఉన్న భవనాలు, పూరిళ్లు 7279 గా గుర్తించడం జరిగిందని, వాటిలో ప్రజలను తుఫాన్ ప్రమాదం తగ్గే వరకు వారి బంధువుల ఇళ్లకు గాని, లేదా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సహాయక కేంద్రాలకు రావలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఉప్పుటేరు బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నదన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ‘మొంథా’ పెను తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం జిల్లాలోని 13 మండలంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 14 మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో గాలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లాలోని 763 హోర్డింగ్స్ ను తొలగించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలెవ్వరూ నదులు, చెరువులు ఈతకు వెళ్లవద్దని, బయటకు రావద్దని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్ పనుల పునరుద్దరణకు గాను 2 వేల విద్యుత్ స్థంబాలు, 500 ట్రాన్స్ఫార్మర్లు, 1200 మంది విద్యుత్ సిబ్బందిని అత్యవసర సేవల నిమిత్తం సిద్ధం చేయడం జరిగిందన్నారు. తుఫాన్ సహాయక చర్యలకు గాను 59 జేసీబీలు, 37 చెట్లు కట్ చేసే యంత్రాలతోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందం ను సిద్ధం చేయడం జరిగిందన్నారు. తుఫాన్ గాలి తీవ్రత, భారీ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తుఫాన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని, జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.