Close

యువత మాదకద్రవ్యాలు జోలికి పోవద్దు, మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ జిల్లా కలెక్టరు అధ్యక్షతన కె.వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు .

Publish Date : 20/05/2026

ఏలూరు, మే 20 : మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దు కునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్ధానిక కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయీ మాదకద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై ప్రగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి బాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. యువత మాదకద్రవ్యాలు జోలికి పోకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు కలిగి వున్నను, వినియోగం, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలకు, పాస్ పోర్ట్ ల జారీకి అనర్హతతో పాటు శాశ్వత క్రిమినల్ రికార్డు కలిగి ఉంటారని, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు. ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసే పోస్టర్ల ద్వారా మరియు క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నా, సరఫరా, రవాణాదారుల సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోనుచేసి సమాచారం అందించవచ్చన్నారు. ఇటువంటి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి డిఅడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగు తుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించ కుండా ఔషధ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. ట్రైన్లు, రవాణా వాహనాలు ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణాని నియంత్రించేందుకు గట్టి నిఘా పెట్టాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పిల్లలు డ్రగ్స్ మత్తుపదార్థాలు అలవాటు కాకుండా అధికార యంత్రాంగంతో పాటు తల్లితండ్రులు కూడా బాధ్యతలు తీసుకోవాలన్నారు. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందని ఎప్పటి కప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. మన పిల్లలు స్నేహాలు, నడవడిక, చదువు పట్ల శ్రద్ధ ఏలా ఉందని పరిశీలన చేసుకోవాలన్నారు. చెడు స్నేహలు వల్ల పిల్లలు దొంగతనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారని, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 సంప్రదించాలని, ఫోన్ చేసిన తక్షణం టీమ్లు క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొలి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అతి సులువుగా తప్పించ వచ్చునని తెలిపారు.

సమావేశంలో జిల్లా ఉప రవాణా కమీషనరు యస్.కె.కరీం, ఆర్&బి శాఖ యస్ఇ కె.విజయ రత్నం, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.యు.శోభ, ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, విభిన్న ప్రతిభా వంతులు శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నమ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, డిఎస్పి డి.శ్రావణ్ కుమార్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.