Close

రహదారి నిర్మాణ, మరమ్మత్తు సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసులు

Publish Date : 31/08/2026

ఏలూరు, ఆగష్టు, 31 : రహదారి నిర్మాణం, మరమ్మత్తుల సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి రహదారి భద్రతపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉంగుటూరు – బాదంపూడి మధ్య జాతీయ రహదారిపై మరమ్మత్తుల సమయంలో సరైన సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు లేని కారణంగా ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని, హెల్మెట్ ధరించినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడని , సదరు కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అతివేగం, నియమాలు పాటించని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు రహదారి భద్రతా నియమాలపై ముఖ్యంగా హెల్మెట్ ధారణ కారణంగా ప్రమాద సమయాలలో ప్రాణాలు కాపాడుకునే విధానంపై కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

రహ్ వీర్ పథకంపై విస్తృత అవగాహన కలిగించాలి-జిల్లా కలెక్టర్ రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసి, ప్రాణనష్టాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం రహ్ వీర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను మొదటి గంటలో ఆసుపత్రికి తీసుకువస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చని, ఆ సమయంలో బాధితుడిని ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి చేర్చి కాపాడే వారిని ‘రహ్-వీర్’ (Rah-Veer) పథకం కింద రూ. 25,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తామన్నారు. ఈ పథకంపై ప్రజలలో విస్తృత అవగాహన కలిగించి, ప్రాణాలు కాపాడాలన్నారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలు తొలగించాలన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు డిజైన్ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో రోడ్డు డిజైన్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు నగరంలో ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని, వాటిని నియంత్రించాలన్నారు. వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు పెద్ద కాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటుచేయడం నిబంధనలకు విరుద్ధమని, అటువంటి వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు, అటువంటి లైట్లు అమ్మే దుకాణాలపై కేసులు నమోదు చేయాలన్నారు.

సమావేశంలో రవాణా శాఖాధికారి శేఖర్, డిపిఓ మల్లికార్జునరావు, డిఎంహెచ్ఓ డా. శోభ , ఆర్ అండ్ బి ఎస్ఈ విజయరత్నం, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, డిఎస్పి శ్రావణ్ కుమార్, జాతీయ రహదారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.