రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖరీఫ్ ధాన్యం సేకరణ అక్టోబర్,7వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం-జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి గోనెసంచుల,తేమశాతం లెక్కింపు, రవాణా వాహనాలలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు

ఏలూరు, సెప్టెంబర్, 23 : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేకరించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు అవసరమైన నాణ్యమైన గోనెసంచులు అందించడం, తేమశాతం లెక్కించడం, ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు అంశాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్, 7వ తేదీ నుండి ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్దులై ఉండాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 5 లక్షల 77 వేల 642 మెట్రిక్ ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగిందని, అందుకు తగిన విధంగా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 25వ తేదీ నుండి రైతులకు గోనెసంచుల అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ పోర్టల్ లో రైస్ మిల్లర్లు రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలన్నారు. ఈ-పంట నమోదు, రైతుల ఈ-కెవైసి నూరుశాతం పూర్తి కావాలన్నారు. రైతులు వారు కోరుకున్న రైస్ మిల్లులకే ధాన్యం పంపించేందుకు చర్యలు తీసుక్కడుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ఈనెల 24వ తేదీ నుండి రైతు సదస్సులు నిర్వహించాలన్నారు. సేకరించిన ధాన్యం రవాణాకు ఉపయోగించే వాహనాలకు జిపిఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతు సేవా కేంద్రం నుండి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించే సమయంలో తేమశాతం ఖచ్చితంగా లెక్కించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ముందుగానే గోనెసంచుల నాణ్యతను పరిశీలించాలని, పాడైపోయిన గోనెసంచులను ఎట్టిపరిస్థితులలోనూ రైతులకు అందించవద్దన్నారు. రైతులకు అందించే గోనెసంచుల విషయంలో రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణలో ఫిర్యాదులు నమోదుకు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేయాలని, వాహనాల కదలికలు, రైతుల నుండి వచ్చే ఫిర్యాదులపై చర్యలను కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ను జిల్లాలోని రైతులందరికీ తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలు, తూనికలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. మండల స్థాయిలో ఎక్కడా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తహసీల్దార్లు, ఎంపిడిఓ లు ధాన్యం సేకరణను పర్యవేక్షించాలన్నారు. రైసుమిల్లులు, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, లారీ యజమానులు అసోసియేషన్ ప్రతినిధులతో అధికారులు సమన్వయము చేసుకుని జిల్లాలో ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఆర్డీఓ ఎన్ .ఎస్. కె. ఖాజావలి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణ రాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజుభార్గవి, వ్యవసాయ శాఖ,మత్స్య శాఖల జాయింట్ డైరెక్టర్లు హబీబ్ భాషా, నాగలింగాచారి, ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి, జిల్లా సహకారశాఖాధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్, లారీ యజమానులు అసోసియేషన్ ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.