రైతులు సమస్యలు తెలిపిన 24 గంటల్లోనే స్పందించి అపరాలు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు.
ఏలూరు/దెందులూరు, మార్చి 03: దెందులూరు విశాల సహకార సొసైటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మంగళవారం రభీ సీజనుకు సంబంధించి జిల్లాలోనే తొలి అపరాలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ లకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది, పుష్ప గుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు నైనా పరిష్కరించి, వారికి అన్ని విధాలుగా సహకరించేందుకు రైతుసేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులు తమ సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం పొందవచ్చునని తెలిపారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనలో రైతులకు ధాన్యం బకాయిలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించడమే కాకుండా ఈనాడు రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన తర్వాత గంటలు వ్యవధిలోనే వారు బ్యాంకు ఖాతాలకు నేరుగా ధాన్యం సొమ్ములు జమ అయ్యేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిజమైన రైతు పక్షపాతి అని నిరూపించుకుందని, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని కూడా అందిస్తుందని తెలిపారు.
కృష్ణా జలాలకు టైయిలెండ్ లో ఉన్న పెదపాడు మరియు ఏలూరు రూరల్ మండలాల్లోని అనేక గ్రామాలు రైతులు తమ నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని రభీ సీజన్లో ఎక్కువగా అపరాలు సాగు చేస్తున్నారని తెలిపారు.అయితే బహిరంగ మార్కెట్లలో దళారీలు వద్ద సరైన మద్దతు ధర లభించక ఇబ్బంది పడుతున్నారని, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దృష్టికి తీసుకువెళ్లిన 24 గంటల లోపే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ జిల్లాలోనే తొలి అపరాలు కొనుగోలు కేంద్రాన్ని దెందులూరులో మంజూరు చేశారని మంచి శుభపరిణామం అన్నారు. అందుకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ అపరాలు కొనుగోలు కేంద్రం ద్వారా పెసలు క్వింటాకి రూ 8768/- , మినుములు క్వింటాకి రూ 7800/- చొప్పున ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు సైతం పూర్తిచేసి రైతులకు కూటమి ప్రభుత్వం మరింత మేలు చేయనుందని, రైతు సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్ని విధాలు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు దెందులూరు ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీమతి గారపాటి రామసీత, సొసైటీ చైర్మన్ గారపాటి కొండయ్య చౌదరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ భాషా, తహశీల్దారు బత్తిన సుమతి , దెందులూరు మండల పార్టీ సెక్రటరీ నాగనబోయిన సత్యనారాయణ, సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పలు సొసైటీల చైర్మన్లు, కూటమి నాయకులు, వివిధ శాఖలు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.