వరద ముంపు ప్రమాదం తెలిజేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

ఏలూరు, జూలై , 12 : జిల్లాలో వరద తగ్గేవరకూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకుంటున్నారు. వరద ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలందరికీ వరద ముంపు ప్రమాదంను తెలియజేసి, వెంటనే వరద సహాయ పునరావాస కేంద్రాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఒక్కరికీ ప్రాణ, ఆస్థి నష్టాలు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద సహాయక చర్యలను చేపట్టి, పర్యవేక్షించేందుకు నియమించిన మండల ప్రత్యేక అధికారులు ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రమాద మండలాల్లోని ప్రజలు నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్లకుండా చూడాలన్నారు. నిండు గర్భిణీలను దగ్గరలోని సామజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో జెనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, త్రాగునీటి కి ఇబ్బంది లేకుండా అవసరమైన ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస కేంద్రంలో వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు, కాజ్ వే లు, రహదారులను ముందస్తుగా మూసి ఉంచడంతోపాటు ప్రజలు ప్రయాణించకుండా ఆ ప్రాంతాలలో సిబ్బందిని నియమించాలన్నారు. వరదల కారణంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.