విద్య ,వైద్యం, ఉపాధి ,పారిశుధ్య నిర్వహణ, మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పన, అక్షరాస్యత పెంపుదల వంటి అంశాలతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లా,మండల అధికారులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపు ఇచ్చారు.
ఏలూరు,జనవరి,20: విద్య ,వైద్యం, ఉపాధి ,పారిశుధ్య నిర్వహణ, మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పన, అక్షరాస్యత పెంపుదల వంటి అంశాలతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లా,మండల అధికారులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపు ఇచ్చారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గ్రామాల దత్తత పై జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి నిర్వచించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రతి జిల్లా, మండల అధికారులు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆదర్శగ్రామాల దత్తత అధికారులు తమ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఎంచుకున్న గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ల నిర్మాణం, ఇద్దరు మౌలిక సదుపాయాలకు అవసరమైన సహకారాన్ని తాము అందిస్తామన్నారు. ఇందుకు ముందుగా దత్తతకు ఎంపికకు తీసుకున్న గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు వాస్తవ సమాచారాన్ని సేకరించడంతోపాటు, ప్రజలకు కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. దత్తత తీసుకున్న గ్రామ అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి సహకరించాలన్నారు. విద్య వైద్యం పారిశుద్ధ్యం స్థిరమైన జీవనోపాధి కమ్యూనిటీ మౌలిక సదుపాయాల లభ్యత మొదలైన సమస్యల పరిష్కారం, అక్షరాస్యత పెంపుదల మహిళా సాధికారతకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ రూపొందించిన ప్రొఫార్మా ఆధారంగా పేదల వివరాలను ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. వారికి ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు పై సర్వే చేయాలన్నారు. అనంతరం ఆ గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీ పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చేలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకున్న అధికారులు ఆ గ్రామాల్లో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామంలో నిరుద్యోగ యువత వివరాలను సేకరించి, వారికి అభిరుచి కలిగిన అంశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. గ్రామంలో త్రాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.