వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి
ఏలూరు, ఫిబ్రవరి 21: స్థానిక తంగెళ్ళమూడి 1వార్డు సచివాలయం వద్ద 27, 28వ డివిజన్ల పరిధిలోని శనివారం భారతీయ ఆహార సంస్థ గోడౌన్లు ఏటిగట్టు ప్రాంతంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ఈ-వేస్ట్ సేకరణ థీమ్”తో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఏపియస్ ఆర్టీసీ విజయవాడ -2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సంయుక్తంగా పాల్గొని, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వార్డు సచివాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు.
ముందుగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఏటిగట్టు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, క్లాప్ మిత్రాలతో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు, ఏఏ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఉదయం ముందుగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ఒక చోట ప్రోగు చేసి, ఇంటింటికి వెళ్ళి తడి, పొడి చెత్తను సేకరిస్తామని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టరు స్పందిస్తూ అంతా బాగా చేసినా అన్ని చోట్ల చెత్త ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. దీంతో క్లాఫ్ మిత్రాలు ఇంటింటికి వెళ్ళినప్పుడు పనులు ఉన్నాయని చెత్తను తర్వాత ఇస్తామని చెప్పి తర్వాత రోడ్డు ప్రక్కల, బయట చెత్తను వేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్స్ వద్ద కార్యక్రమాలు అయిన తర్వాత చెత్తను రాత్రి సమయాలలో ఇక్కడకు తరలించి చెత్తను వేస్తున్నారని చెప్పారు. దీంతో స్పందిస్తూ జిల్లా కలెక్టరు శాశ్వత చర్యలకు నగరపాలక సంస్థ కమిషనరుకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-వెస్ట్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాలు, మునిపాలిటీలో ఒక మహోద్యమంగా జరుగుతున్నాయన్నారు. జిల్లా స్థాయీ కార్యక్రమం తంగెలమూడి ఏటిగట్టు ప్రాంతంలో నిర్వహించుచున్నామని అన్నారు. ఈ-వేస్ట్ పర్యావరణానికి విఘాతమని పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రమైన నగర, గ్రామాలు నిర్మాణ కోసం పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఛార్జర్లు, బ్యాటరీలు, టీవీలు, తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. శుభ్రమైన ఏలూరు, ఆరోగ్య కరమైన ఏలూరు ‘మీ ఫిర్యాదు – మా ప్రాధాన్యం’ పై ఇప్పటికే నగరపాలక సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మరలా ఈరోజు 9491041419 మీరు నేరుగా కాల్ చేయవచ్చనన్నారు. లేదా ఎస్ఎంఎస్ పంపవచ్చును లేదా వాట్సప్ ద్వారా మీ సమస్యలను తెలియ జేసినట్లయితే కొన్ని నిమిషాల్లో పరిష్కరించి, ఏలూరును పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. త్వరలో ఇక్కడ ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేస్తామని, చెత్తను వేసే వాహనాలను ఫోటోలు తీసి వాట్స్అఫ్ పెట్టితే చర్యలు వెనువెంటనే తీసుకుంటామని, అలాగే చెక్ పోస్టును 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకుంటే పరిస్థితి తప్పక మారుతుందని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులు దూరం అవుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు. మన ఇంటితోపాటు చుట్టు ప్రక్కల పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శీతాకాలం సీజన్లో అంటూ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, చిన్నారులు, వృద్ధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుటకు, పరిశుభ్రంగా మార్చటం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఒక ఉద్యమంగా ముందుకుతీసుకు వెళ్ళుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఒక అంశంమీద జరుగుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. క్లాప్ మిత్రాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని, ప్రజలు అంతా సహకారం అందించినప్పుడే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందన్నారు. ఎక్కడయినా చెత్తచెదారం వేసి వెళ్ళుతున్న వాహనాలను ఫోటోలు తీసి వాట్స్అఫ్ పెట్టినట్లయితే వెనువెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏలూరు పట్టణాన్ని ఆరోగ్యకరమైన, సుందరవదనంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి వద్ద నుంచి చెత్తను వేర్వేరుగా (తడి, పొడి) క్లాప్ మిత్రాలకు అందజేయ్యాలని, ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. స్వచ్ఛమైన పరిసరాలు మంచి ఆరోగ్యానికి పునాది అని, ప్రజలంతా సహకరించాలని కోరారు. నగరంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రజలందరూ చురుకుగా పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాదు, జిల్లా వివిధ శాఖలు అధికారులు, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, నగర పాలక సంస్థ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, పట్టణ పలు విద్యాసంస్థలు విద్యార్థులు, యన్ సిసి, యన్ ఎస్ ఎస్, పలు సేవా సంస్థలు సభ్యులు, స్థానిక ప్రజలు, క్లాప్ మిత్రాలు, తదితరులు పాల్గొన్నారు.