Close

వ్యవసాయ, అనుబందరంగాల లక్ష్యాల ప్రగతిపై అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్

Publish Date : 17/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 17 : జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా సాగు విస్తరణ లక్ష్యాలను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి వ్యవసాయ, అనుబందరంగాల లక్ష్యాల ప్రగతిపై మంగళవారం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణానికి అదనంగా నిర్దేశించిన 15 వేల 847 హెక్టార్లలో ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో వంటి ఉద్యానవన పంటలు సాగు విస్తరణ లక్షలలో 12 వేల 322 హెక్టార్లలో మాత్రమే సాగు విస్తరణ పూర్తి అయిందని, వీటిలో 13 వేల 700 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంటల సాగు విస్తరణకుగాను ఇంతవరకు 10 వేల 544 హెక్టార్లు మాత్రమే పూర్తి అయిందని, ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులను ప్రోత్సహించి మిగిలిన లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్, వ్యవసాయ, ఉద్యానవన, తదితర ప్రాధాన్యతా రంగాల రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలను ప్రతీ రైతు సద్వినియోగం చేసుకునేలా జిల్లాలోని ప్రతీ సేవా కేంద్రం వద్ద ప్రభుత్వ ప్రోత్సాహకాలు తెలిపే వివరాలను ప్రదర్శించాలన్నారు. జిల్లాలో కోకో నాణ్యతను పెంచేలా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు రైతులకు అవగాహన కలిగించి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రిప్, స్ప్రింకలర్లు 8500 హెక్టార్లలో ఏర్పాటు లక్ష్యానికిగాను 6268 హెక్టార్లలో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పథకంపై రైతులకు మరింత అవగాహన కలిగించి, వారు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని, ఎరువుల పంపిణీ, లభ్యత, నిల్వ తదితర వివరాలను జిలాల్లోని రైతు సేవా కేంద్రాలు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద నోటీసు బోర్డులో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపి ఫార్మర్స్ రిజిస్ట్రీ నమోదు, ఈ-పంటనమోదు ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్, వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.