సాగులో యాంత్రికరణను ప్రోత్సహించండి: కలెక్టర్ వెట్రిసెల్వి
భీమడోలు, నవంబర్, 19 : సాగులో యాంత్రికరణను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధన దిశగా రైతులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రైతులకు సూచించారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో మంగళవారం పైడే వెంకట్రాజు పొలంలో యంత్రాల ద్వారా ధాన్యం నూర్పిళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగులో యాంత్రీకరణ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని, యంత్రాలు కొనుగోలుకు 50 శాతం వరకు సబ్సిడీ అందిస్తుందన్నారు. సాగులో యంత్రాల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గడంతోపాటు, సమయం కూడా ఆదాయం అవుతుందన్నారు.
అగ్రికల్చర్ ల్యాబ్ లో పరిశోధనా ఫలితాలు ఎప్పటికప్పుడు రైతులకు చేరాలి-కలెక్టర్ భూసార పరీక్షలు, వరికి సోకే తెగుళ్ల నివారణకు సంబందించిన పరిశోధనా ఫలాలు రైతులకు ఉపయోగపడేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని రైతులకు చేరాలని, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. భీమడోలు లోని అగ్రి ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. ల్యాబ్ లో చేసే పరీక్షలను సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులను భాగస్వాములను చేసి, ఉత్తమ యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల వివరాలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు తీసుకోవలసిన చర్యలు, వరి పంటకు సోకే తెగులు నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, అసిస్టెంట్ డైరెక్టర్ ఉష రాజకుమారి, వ్యవసాయాధికారి రవికుమార్, తహసీల్దార్ రమాదేవి, మత్స్యశాఖాధికారి లీలదుర్గ ఎంపిడిఓ పద్మావతి, ప్రభృతులు పాల్గొన్నారు.