సేంద్రియ ఆహార ఉత్పత్తులకు ప్రజల నుండి విశేష స్పందన ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు పెద్దపీట
ఏలూరు, జూన్, 14 : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం వారి ద్వారా ఔత్సాహిక రైతులకు ప్రకృతి సేద్యంలో శిక్షణ అందిస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో ప్రకృతి సాగు విస్తీర్ణం మరింతగా పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ప్రకృతి వ్యవసాయానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో, అదేవిధంగా సేంద్రియ వినియోగంతో ప్రకృతి సాగుతో పండించిన ఆహార ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అంతే ప్రాధాన్యతను ఇస్తున్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో కొంతమేర అధిక దిగుబడులు వచ్చిన్నప్పటికీ ప్రజలు కాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, రసాయనిక ఎరువులు వినియోగం కారణంగా కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కలిగించి, సేంద్రియ ఎరువులు వినియోగించిన ఆహార ఉత్పత్తుల వినియోగం కారణంగా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేసి ప్రజలు వాటి వాడకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా ఏలూరు రైతు సంపద (www.elururaithusampadha.in) పేరుతో ఆన్లైన్ లో అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాక ప్రకృతి సాగుతో పండించిన ఆహార ఉత్పత్తుల వినియోగంపై ప్రజలలో పెత్తఎత్తున అవగాహన కలిగించేందుకు ఏలూరులో ఇటీవల రెండురోజుల పాటు పెద్దఎత్తున సేంద్రియ ఆహార మేళా ను నిర్వహించారు. మన జిల్లాలోని రైతులు సహజ మరియు సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, రైతు-వినియోగదారుల మధ్య నేరుగా మార్కెటింగ్ విధానం కల్పించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యం. జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రెండు రోజుల్లోనే 20 లక్షల రూపాయలకు పైగా సేంద్రియ ఆహార ఉత్పత్తులను ప్రజలు కొనుగోళ్లు చేశారు. ఏలూరు రైతు సంపద పోర్టల్ ద్వారా రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు అమ్మకాలు చేస్తున్నారు.
జిల్లాలో ఇదే ఒరవడి కొనసాగేందుకు జిల్లాలోని ప్రతీ రైతు బజార్లు, బస్సు స్టాండ్ లలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలకు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.