Close

స్థానిక అశోక్ నగర్ లోని కె.పి . డి టి హైస్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

Publish Date : 15/11/2025

ఏలూరు, నవంబర్, 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించిన తరవాతే విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్ లోని కె.పి. డి టి హైస్కూల్ ని శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత , విద్యా బోధనల స్థాయిలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కలెక్టర్, డీఈఓ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏజెన్సీ వారు, ఉపాధ్యాయులు ఎటువంటి రాజీ పడవద్దన్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం రుచి, శుచి తప్పనిసరిగా ఉండేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. కె.పి. డి టి హైస్కూల్ లో భోజనం నాణ్యతను విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటివద్దనుండి బాక్స్ లలో భోజనాన్ని తీసుకురావడంపై కలెక్టర్ వారిని పిలిచి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను సమస్యలను గురించి కలెక్టర్ అడుగగా, పాఠశాలలో ఫ్యాన్లు తక్కువగా ఉన్నాయని, విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని విద్యార్థులు కోరారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ లలో అందించే మధ్యాహ్న భోజనం పూర్తి నాణ్యతతో ఉండాలని, ఎంఈఓ లు, సంబంధిత ప్రతీరోజు భోజనాన్ని తనిఖీ చేయడం, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, భోజనం నాణ్యతను పర్యవేక్షించడం తమ పర్యటన లో ఒక భాగం చేసుకోవాలన్నారు.

విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పాఠశాల తనిఖీలో భాగంగా 8వ తరగతిలో విద్యార్థినులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని చదవవలసిందిగా కలెక్టర్ విద్యార్థినులను కోరగా, చదవలేకపోవడం, ఉపాధ్యాయులను ప్రశ్నించగా వారు కూడా సక్రమంగా జవాబు ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను వారి చదివే తరగతి కి తగ్గట్టుగా విద్యా సామర్ధ్యాలను కలిగి ఉండాలని, వారికి ఆవిధంగా విద్యా బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మరింత పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని కలెక్టర్ హితవు పలికారు.

జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ వి. అరుణ్ కుమార్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోధ్యాయుడు నాగమునేశ్వరరావు, ఉపాధ్యాయులు, ప్రభృతులు పాల్గొన్నారు.