Close

హెల్మెట్ ధారణ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 16/01/2025

ఏలూరు,జనవరి, 16: ప్రతి ఒక్కరూ రహదారి భధ్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో “జాతీయ రహదారులు భద్రత మాసోత్సవాలు – 2025” గోడప్రతులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి, పోలీస్, పంచాయితీరాజ్, ఎన్ హెచ్ తదితర శాఖలు కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. మానవ తప్పిదాల వల్లే 75 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పరిమితికి మించివేగం, మద్యంసేవించి వాహనం నడపడం వల్ల సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నేపధ్యంలో ఏలూరు జిల్లాలో జనవరి 16 వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు భధ్రత పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగు తోందన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఆటో డ్రైవర్లు కు ట్రాఫిక్ నియమావళి , జాతీయ రహదారులు పై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హెల్మెట్ ధారణ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యువతకు, ఆటో డ్రైవర్లు కు, మహిళలకి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రహదారుల భధ్రత పై కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా ఇన్ చార్జి ఉపరవాణా శాఖ అధికారి కెఎస్ఎంవి కృష్ణారావు మాట్లాడుతూ ఈఏడాది రహదారి భధ్రత ప్రచారానికి సంబంధించి “శ్రద్ధవహించండి” అనే నినాదంతో జాతీయ రహదారులు భద్రత మాసోత్సవాలను జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహన చోదకులకు, యువతకు , ఆటో డ్రైవర్లు కు ట్రాఫిక్ నియమావళి పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, పట్టణాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం తో నెల రోజుల పాటు అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. చోధకులకి అవగాహన కల్పించడం, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు, భారీ వాహనాలను నడిపే వారికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్ టి సి డిఎం బి. వాణి, మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు భీమారావు, జి. ప్రసాదరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు కుమారి ప్రజ్ఞ, జగధీష్, బద్దు, నరేంధ్ర, నెహ్రూకుమార్, ట్రాఫిక్ ఎస్సై మధు,తదితరులు పాల్గొన్నారు.