హైరిస్క్ గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక పర్యవేక్షణకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి. ప్రాజెక్టు మాతృ అమలుపై జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష .
ఏలూరు, జూన్ 02: జిల్లాలో తల్లి,శిశు మరణాలను పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న “ప్రాజెక్టు మాతృ- జీరో ఐఎంఆర్, ఎంఎంఆర్ పైలట్ ప్రాజెక్టు” అమలుపై జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు,వైద్యాధికారులుతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు
కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు శిశువులు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తల్లి,శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికప్రమాద (హైరిస్క్) గర్భిణులను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చెయ్యడం, ప్రసవాలకు ముందు మరియు తరువాత అవసరమైన వైద్యసేవలు అందించడం, సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలుపై జిల్లా కలెక్టరు అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి ముందు ఒక నెలపాటు రోజువారీగా ఆరోగ్యపరంగా పర్యవేక్షించాలని, ప్రతి హైరిస్క్ గర్భిణీస్త్రీలను పర్యవేక్షణ కోసం ఒక అడాప్షన్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు జిల్లాలో వినూత్న కార్యక్రమంగా నూజివీడు క్లస్టర్ పరిధిలో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. నూజివీడు క్లస్టర్ పరిధిలోని 11 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో మొత్తం 1,635 మంది గర్భిణులను గుర్తించగా, వారిలో 790 మందిని హైరిస్క్ గర్భిణులుగా గుర్తించినట్లు వెల్లడించారు. జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో ప్రసవాలకు సిద్ధంగా ఉన్న 624 మంది గర్భిణుల్లో 315 మంది హైరిస్క్ గర్భిణులుగా గుర్తించ బడ్డారని, వీరందరికీ సురక్షిత ప్రసవాలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు అమలులో సాధించవలసిన పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటిపరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలుపై అధికారులతో చర్చించారు. జిల్లాలో తల్లి,శిశు ఆరోగ్య సూచికలను మెరుగు పరచడంలో ప్రతిశాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గర్భిణీస్త్రీలు ఆరోగ్యపరిరక్షణలో భాగంగా యోగాను, ఎక్సర్సైజులు తో పాటు కొద్ది సమయం నడకను తప్పక పాటించేలా చూడాలని అన్నారు. డెలివరీ అయిన తర్వాత 40 రోజులుపాటు మాతాశిశు గృహాలకు తప్పనిసరిగా వెళ్ళి వైద్య సేవలు, సూచనలు సలహాలు అందిస్తూ, పౌష్టికాహారం తీసుకోవలసిన జాగ్రత్తలుపై తెలియ చెప్పాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు. శోభ, జిల్లా ఐసిడిఎస్ పిడి పి.శారద, డిసిహెచ్ ఎస్ డా.సి.హెచ్. బేబికమల, డిప్యూటి డియంహెచ్వో డా.యస్. పద్మావతి, నోడల్ ఆఫీసరు శ్రీనివాసరావు, నూజివీడు నియోజకవర్గం వైద్య నిపుణులు, వైద్యాధికారులు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.