100 రోజులలో నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ చానెల్స్ తూడు తొలగించి, నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం
ఏలూరు, ఏప్రిల్, 6 : ఏలూరు జిల్లాలో 100 రోజులలో నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలియజేసారు. ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంపై ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి సోమవారం సాయంత్రం వివిధ జిల్లా కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ చానెల్స్ తూడు తొలగించి, నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ఉద్యానవన రైతులు తమ క్షేత్రాలలో తప్పనిసరిగా ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని కోరామన్నారు. జిల్లాలోని ప్రతీ సాగునీటి సంఘాల ప్రతినిధులు రైతులను సమాయత్తం చేసి ఈ కార్యక్రమంలో బాగస్వాములయ్యేలా చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ కిషోర్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష, ఏపి యంఐపి పిడి డా.యస్.రామ్మోహన్,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖధికారి గోవిందరాజులు, డ్వామా పీడీ సుబ్బారావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు, భూగర్భజల అధికారి కోదండరావు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.