2025 అంతర్జాతీయ సహకార సంవత్సరం-సహకార వ్యవస్థ పై ప్రజలకు అవగాహనకు కార్యక్రమాలు నిర్వహించాలి- అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

ఏలూరు, మార్చి , 17 : దేశ సుస్థిర అభివృద్ధిలో సహకార సంస్థల పాత్ర కీలకమని, సహకార సంఘాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం ప్రకటించిందన్నారు. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సహకార వ్యవస్థ స్థిరమైన జీవనోపాధి సృష్టించుటకు వారి ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకార వ్యవస్థను గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు ర్యాలీలు, సమావేశాలు, మారథాన్ లు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025 సంవత్సరంలో నెలలవారీగా చేయవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ప్రణాళిక ననుసరించి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సహకార శాఖాధికారులను ఆదేశించారు. సహకార వ్యవస్థ ద్వారా సమాజాభివృద్ధిపై పాఠశాల స్థాయి నుండి అవగాహన కలిగించేందుకు మార్చి నెలలో వ్యాసరచన, వ్రకృత్త్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల సర్వసభ్య సమావేశాలలో ద్వారా వ్యవసాయ రంగం, ఇతర రంగాలకు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సహకారరంగాన్ని ఉన్నతమైన వ్యవస్థగా రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగంలో తీసుకున్న సంస్కరణల గురించి చేస్తున్న కార్యక్రమాలను వివరించాలన్నారు. ఏప్రిల్ నెలలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని, సహకార రంగ అభివృద్ధిలో మహిళా పొదుపు సంఘాల పాత్ర గురించి తెలియజేయాలన్నారు. మే నెలలో సహకార రంగాలలో సుపరిపాలనకు తీసుకోవలసిన చర్యలు గురించి సహకార సంఘాల సభ్యులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ నెలలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జులై నెలలో జులై,5వ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, మారథాన్ లు నిర్వహించాలన్నారు. ఆగష్టు లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ లో పాఠశాలలు, కళాశాలల్లో సహకార వ్యవస్థ, దేశ అభివృద్ధిలో పాత్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సాగు రైతులు, ఉద్యానవన రైతులు , మత్స్యకారులకు వారి పంట సీజన్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ నెలలో సమావేశాలు నిర్వహించి రైతుల సేవలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పాత్ర అనే అంశాన్నితెలియజేయాలని, వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. నవంబర్ లో పాఠశాలలు, కళాశాలల్లో సహకార రంగంలో అర్బన్ బ్యాంకులు సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ లో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఉద్యోగులు సహకార పరపతి సంఘాలు, తదితర పరపతి సెమినార్లు నిర్వహించాలని కలెక్టర్ సహకార శాఖాధికారులను ఆదేశించర్రు. సహకార సంఘాల సక్రమ నిర్వహణ నిమిత్తం అందుకు తగిన విధంగా వాటిలో జరిగే సభ్యత్వం, డిపాజిట్లు, రుణాలు, పెట్టుబడులు, తదితర లావాదేవీలు అన్నీ నిర్దేశించిన సమయంలో కంప్యూటరీకరణ చేయాలన్నారు. సహకార వ్యవస్థ ద్వారా జరిగే సమాజాభివృద్ధిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడంతోపాటు సహకార రంగాన్ని జిల్లాలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, జిల్లా సహకార శాఖాధికారి ఏ . శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం అంతర్జాతీయ సహకార సంవత్సరం థీమ్ లోగో ని కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు.