రాష్ట్రంలో ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి నూతన ఉచిత ఇసుక సరఫరా విధానం అమలుకావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
పత్రిక ప్రకటన
8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకావాలి
జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
జిల్లా నుంచి వర్చువల్ గా హాజరైన
జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి
ఏలూరు, జూలై 06 : రాష్ట్రంలో ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి నూతన ఉచిత ఇసుక సరఫరా విధానం అమలుకావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం ఉదయం విజయవాడలోని క్యాంవు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక సరఫరా విధానంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె.వెట్రి,జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఎస్పీ డి .మేరీ ప్రశాంతి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జూలై 8 నుంచి ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభం కావాలన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు చేసి, ధరలను నిర్ణయించాలన్నారు. ఆన్ లైన్ ద్వారానే వినియోగదారుడు చెల్లింపులు చేయాలని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను బట్టి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇసుక రీచులతో పాటు కొత్త ఇసుక రీచులను గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇసుక రవాణాకు అవసరమైన ఇంటర్నల్, కన్స్యూమర్ పెర్మిట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రానికి జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఏర్పాటుకావాలని, ఇసుక ధరలను నిర్ణయించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అధికారులు, సిబ్బందులను విధులకు కేటాయించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పి సూర్య చందర్రావు , ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతి కుమారి, డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్, మైనింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తదితర అధికారులు పాల్గొన్నారు.