అధికార యంత్రాంగం చొరవతో 30 మందికి తప్పిన ముప్పు
ఏలూరు, జులై, 18 : ఏలూరు జిల్లా యంత్రాంగం తీసుకున్న వరద ముందస్తు చర్యలతో జిల్లాలో పలు పెను ప్రమాదాలు తప్పాయి. జిల్లాకు చెందిన 30 మంది అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం వద్ద గల కట్టమైసమ్మ గుడివద్ద పెద్ద వాగు ప్రాజెక్ట్ వరద నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. వెంటనే ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం అధికారుల దృష్టికి రాగా, వెంటనే వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు యుద్ధప్రాతిపదికన ఎన్.డి. .ఆర్.ఎఫ్. బృందంతో హెలికాప్టర్ ఏర్పాటుచేయడంతో 30 మంది ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఏ ఒక్కరికి ఎటువంటి అపాయం జరగకుండా 30 మందిని రక్షించడం జరిగింది. అదేవిధంగా వేలేరుపాడు మండలం మాధవరం వద్ద వరదనీటిలో 5గురు కుటుంబ సభ్యులతో ఉన్న కారు చిక్కుకోగా, స్థానిక ప్రజల సహకారంతో సిబ్బంది సదరు 5గురు వ్యక్తులను కాపాడారు. జిల్లాలో నదులు, వాగులు పొంగి ప్రవహించడంతో అన్ని కాజ్ వే ల వద్ద హెచ్చరిక బోర్డులు ఉంచడంతోపాటు, సిబ్బందిని నియమించి ప్రమాద సమయంలో వాగులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరదల కారణంగా ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలన్నదే జిల్లా యంత్రాంగం ధ్యేయంతో పనిచేస్తోంది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంనకు నివేదించడం, అవసరమైన సహాయ చర్యలను తీసుకోవడంతో పలు ప్రమాద ఘటనలలో ప్రజలు ప్రాణాలను రక్షించుకోగలిగాం.