భారీ వర్షాలు, వరదలు, త్రాగునీరు, వైద్యం, తదితర అంశాలపై సిఎస్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, జూలై, 18…జిల్లాలో భారీ వర్షాలు, వరదలు మూలంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో సర్వ సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ భారీ వర్షాలు, వరదలు, వైద్యం త్రాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ముంపు ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిత్యవసర సరుకులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. త్రాగునీరు, పారిశుధ్యం, వైద్యం, పశుసంక్షేమం తదితర విషయాల్లో అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పెదవాగు పొంగి ప్రవహించడంతో వాగులోని పొదల్లో చిక్కుకున్న 5 గురు వ్యక్తులను రక్షించేందుకు ఘటనాప్రాంతానికి తక్షణమే సహాయ బృందాలను పంపి రక్షించడం జరిగిందని వివరించారు. అలాగే అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ గుడివద్ద పెదవాగు ప్రవాహానికి చిక్కుకున్న వారిని ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందన్నారు.
సమావేశంలో ఏలూరు ఆర్డివో ఎన్ఎస్ కె ఖాజావలి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.