వరద ప్రభావిత బాధిత ఇళ్లకు వెళ్లి ప్రజలను వరద పునరావాస కేంద్రాలకు రావలసిందిగా విజ్ఞప్తి చేసిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

ఏలూరు/వేలేరుపాడు, జులై 22 : గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ లు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు గ్రామాలలో పర్యటించి వరద తీవ్రత దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలి రావలసిందిగా వరద ముంపు గ్రామాల ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, వేలేరుపాడు మండలంలోని చాకరపల్లి గ్రామాలలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వరద సహాయక కేంద్రాలకు రావలసిందిగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద మరింత పెరిగితే ప్రమాదమని, గోదావరి వరద ఉధృతి తగ్గేంతవరకు వరద పునరావాస కేంద్రాలలో ఉండాలని ప్రజలను కోరారు. వరదల కారణంగా మీకు ఎటువంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు అంగీకరించిన కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి గ్రామ ప్రజలను అధికారులు మాధవరం గ్రామపంచాయతీలోని మర్రిపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ కి తరలించారు. వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని సందర్శించి కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించారు. చాకరపల్లి గ్రామంలోని ప్రజలను అధికారులు దాచారం లోని ఆర్ అండ్ ఆర్ కాలనీ కి తరలించారు. అనంతరం వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట అంగన్వాడీ కేంద్రంలో నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ ను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వరద కారణంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలకు 3 రోజులకు సరిపడా 5 కిలోల బియ్యం, అరకేజీ కందిపప్పు, అరకేజీ వంటనూనె, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి, బంగాళాదుంపలు, తదితర కూరగాయలు కేజీ చొప్పున నిత్యావసర సరుకులను, ప్రతీ ఇంటికి వాటర్ పాకెట్స్ ఒక బస్తా చొప్పున ఇంటింటికి సిబ్బంది అందించారన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డీఎస్ ఓ ఆర్.సత్యనారాయణ రాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ డి ఎం మంజుభార్గవి, తహసీల్దార్ చిన్నారావు, ప్రభృతులు పాల్గొన్నారు.