Close

ఉచిత ఇసుక విధానం పూర్తి పారదర్శకతతో అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 29/07/2024

ఏలూరు, జూలై , 29 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లాలో ఉచిత ఇసుక విధానంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం పూర్తి పారదర్శకతతో అమలు కావాలన్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద 24 గంటలూ పనిచేసేవిధంగా సిసి కెమెరాలు, సిబ్బంది తప్పనిసరిగా తప్పనిసరిగా ఉండాలన్నారు. సిబ్బందిని మూడు షిఫ్ట్ లాలీ నియమించాలని, స్టాక్ పాయింట్ లో ప్రతీరోజు ఉదయం ప్రారంభం నిల్వ, ఆరోజు సరఫరా చేసినది, నిల్వ వివరాలతో పకడ్బందీగా రికార్డులు నిర్వహించాలన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ధరలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, నిర్దేశించిన ధరలకంటే అధికంగా వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. స్టాక్ పాయింట్ నుండి బయటకు వచ్చిన వాహనాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆకస్మికంగా చేసి, రికార్డులలోగాని, ఇసుక పరిమాణంలోగాని తేడాలుంటే వెంటనే విచారణ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. గనుల శాఖ అధికారులు సంబంధిత తహసీల్దార్లు ప్రతీరోజు తప్పనిసరిగా ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించి, రికార్డులలో సంతకాలు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలింపు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాపై పత్రికలలో ప్రచురించబడిన వివాదాస్పద వార్తాంశాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, వార్తలోని నిజానిజాలను పరిశీలించి విచారణ చేసి నివేదిక సమర్పించాలన్నారు. టాస్క్ ఫోర్స్ బృందం నిఘా మరింత పటిష్టం చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఇంచార్జి డిఆర్ఓ ఎం. ముక్కంటి, ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి , ఉప రవాణా కమీషనర్ శాంతకుమారి, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రవికుమార్, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డీఆర్డీఏ పీడీ కె. విజయరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.