Close

ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 20/08/2024

ఏలూరు,ఆగస్టు,20:ప్రభుత్వ బాలుర వసతిగృహ విద్యార్ధుల ఆరోగ్యం, ఆహారం, చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గౌ. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలతో వివిధ శాఖల ఆద్వర్యంలో నిర్వహించబడుచున్న బాలల వసతి గృహాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నింటిని తనిఖీచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఐసిడిఎస్ పిడి, డిఇఓ, డిసిపివోలను ఆదేశించారు.

ఈ సందర్బంగా మంగళవారం శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్నికలెక్టర్ కె. వెట్రిసెల్వి సందర్శించారు. విద్యార్ధులు మంచిగా చదువుకొని ఉన్నత స్ధానంలో రాణించాలని విద్యార్ధులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వసతి పొందుతున్న63 మంది వీధి బాలలు, బిక్షాటన చేయు బాలలు వివిధ కారణాల వలన తల్లిదండ్రులకు దూరమైన బాలలు 7 సంవత్సరాల వయస్సు నుండి 18 సంవత్సరాలు లోపు పిల్లలందరిని ఆత్మీయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయురాలుగా వ్యవహరిస్తూ విద్యార్ధులతో మమేకమై వారి చదువుతున్న తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను వివిధ ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలను వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు, ఆటస్ధలాన్ని కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం, వసతిగృహం సూపరింటెండెంట్ పి. శ్రీవల్లి, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, మున్సిపల్ కమీషనరు చంద్రశేఖర్, డిసిపివో సూర్యచక్రవేణి, తహశీల్దారు శేషగిరి తదితరులు ఉన్నారు.