Close

ఇసుక రవాణ చేసే వాహనాలను ఆన్ లైన్ ద్వారా తక్షణమే రిజిష్టర్ చేసుకోవాలి.

Publish Date : 09/09/2024

ఏలూరు, సెప్టెంబరు,9:ఇసుక రవాణాచేసే వాహనాలను ఆన్ లైన్ ద్వారా సోమవారం సాయంత్రం నాటికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. సెప్టెంబరు 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు పంపిణీ విధానం ఉంటుందన్నారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీ తనంతో ఉచిత ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా లారీ యాజమాన్యాలు తమ వాహనాలను రిజిష్టర్ చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇంత వరకు 60 వాహనాల రిజిష్ట్రేషన్ జరిగిందని, మిగిలిన వాహనాల రిజిస్ట్రేషన్ కూడా సోమవారం సాయంత్రం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. నూతన ఇసుక విధానం ప్రజలకు మేలు జరిగేలా ట్రాన్స్ ఫోర్టర్లు సహకరించాలన్నారు. అదే విధంగా ట్రాన్స్ ఫోర్టర్లకు అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తుందన్నారు. లారీ టిప్పర్ల కెపాసిటీని బట్టి ధరలు నిర్ణయించజడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా అక్రమ ఇసుక రవాణాకు తావులేకుండా ట్రాన్స్ ఫోర్టర్లు సహకరించాలన్నారు. ప్రస్తుతం గరిష్టంగా రోజుకు 20 టన్నుల వరకు ఒక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని జిల్లాలో సరాసరి రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నులు బుకింగ్ జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా లారీ యజమానులు ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి రవాణా చార్జీలు, తదితర అంశాలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాధనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని వారికి కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక రవాణాకు వాహనాల రవాణా చార్జీలను రాష్ట్రమంతటా ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం నిర్ధారిస్తుంది. జిల్లాలో మరిన్ని ఇసుక డిసీల్టింగ్ చేపట్టేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ఆమోదించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసే సిబ్బంది అందరికి నూతన విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ విధానంలో అమలు చేయవల్సిన విధి విధానాలను వివరించారు. మొలైల్ ఫోన్లు, పిఓఎస్ ప్రింటర్లు, సిమ్ కార్డులు, ప్రోక్యూర్ మెంట్, ఇసుక పంపిణీకి సంబంధించి ఫిర్యాదుల నమోదుకు ఇ-మెయిల్ అడ్రస్, కంట్రోల్ రూం నెంబరు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

సమావేశంలో మైనింగ్ డిడి రవికుమార్, ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, డిపివో టి. శ్రీనివాస విశ్వనాధ్, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, ఆర్టిఓ శ్రీహరి, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ హబీబ్ భాష,ఇరిగేషన్, సెబ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.