ఉచిత ఇసుక విధానంపై ఆన్లైన్ పోర్టల్ ను అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు.
ఏలూరు, సెప్టెంబర్, 19 : ఏలూరు జిల్లాలో ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకను పూర్తి పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తెలియజేసారు. ఉచిత ఇసుక విధానంపై ఆన్లైన్ పోర్టల్ ను అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఏలూరు కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్ లో సులభతరంగా నమోదు చేసుకొనే ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించడం జరిగిందన్నారు. ఇసుక రవాణాకు కేటాయించిన వాహనం ఎక్కువ సమయం స్టాక్ పాయింట్ వద్ద వేచి ఉండకుండా కేటాయించిన సమయానికి లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, వాహనానికి జి.పీఎస్. విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయాలు ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేలా పోర్టల్ రూపొందించడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక సరఫరాపై వినియోగదారుల నుండి అభిప్రాయం తీసుకుంటామని, వారి సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకుంటామన్నారు. ఇసుక సరఫరాలో అక్రమాలు జరగకుండా అవసరమైన ప్రతీ వ్యక్తికి ఉచిత ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్డీఓ లు ఎన్ .ఎస్.కె. ఖాజావలి, కె. అద్దయ్య, రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ ఎస్. శాంతకుమారి, డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, గనుల శాఖ డిడి రవికుమర్, ప్రభృతులు పాల్గొన్నారు.