ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రదర్శనలో ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు… చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయం… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, సెప్టెంబర్, 21 : వరల్డ్ ఫుడ్ ఇండియా పేరిట భారతదేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఇతర దేశాలతో పాటు ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమ నిర్వహణకు 2024 సంవత్సరం భారత దేశం వేదికగా నిలిచింది. సెప్టెంబర్ 19 తేదీనుంచి 22వ తేదీ వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ఇండియా పేరుతో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘ సభ్యులు తమ ఆహార ఉత్పత్తులు ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 జిల్లాలు ఎంపిక కాగా , వాటిలో ఏలూరు జిల్లా , కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన మథర్ థెరీసా మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు తోట కృపామణి తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయమన్నారు.
ఈ ఉత్పత్తుల ప్రదర్శనను తొలి రోజు కేంద్ర ఆహార శుద్ది శాఖా మాత్యులు చిరాగ్ పాశ్వాన్ ప్రారంబించగా రెండో రోజు శనివారం ఆంధ్ర ప్రదేశ్ ఆహార శుద్ధి శాఖా మాత్యులు టి. భరత్ రాష్ట్ర స్టాల్స్ తిలకించి అభినందించడం జరిగింది. ఇతర దేశాల కార్పొరేట్ కంపెనీలతో పాటు మన తెలుగు మహిళలు తయారు చేసిన ఆహార ఉత్పత్తులు అక్కడ ప్రదర్శించటం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల స్వయం సమృద్ధి కోసం గౌ. ముఖ్యమంత్రి శ్రీ చంద్ర బాబు నాయుడు ఆలోచన మేరకు మహిళా గ్రూపులను మరింత సమర్ధవంతంగా తయారు చేస్తామన్నారు. ఇప్పటికే మహిళ సంఘాల తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కోసం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫారంలో ఆన్ లైన్ సదుపాయం కల్పించామన్నారు. మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరచటానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగా మహిళ ఆర్థిక స్వావలంబన కోసం ఎక్కువ మంది మహిళలకు ఋణ సదుపాయం కల్పించి వారి చేత యూనిట్లు నెలకొల్పటానికి జిల్లాగ్రామీణాభివృద్ధిసంస్థ సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు మన జిల్లా ఉత్పత్తులు వెళ్ళటానికి కృషి చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డా.ఆర్.విజయ రాజుని, జిల్లా జీవనోపాధుల విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనితని, మహిళా గ్రూపులు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విజయ కుమారిని వెలుగు సిబ్బందిని, ఉత్పత్తులు తయారు చేసిన తోట కృపామణిని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.