Close

జిల్లాలో మరో నెల రోజులవరకు సరిపడా ఇసుక నిల్వలు ఉన్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి వెల్లడి.

Publish Date : 07/10/2024

ఏలూరు, అక్టోబరు, 7: జిల్లాలో మరో నెలరోజుల్లో పట్టిసీమ, గూటాల, గూటాల-1 ప్రాంతాల్లో ఇసుక రీచ్ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు.

సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక అమలు విధానంపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జెసి పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే పోలవరం మండలం పట్టిసీమ, గూటాల , గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఉచిత ఇసుక అమలు విధానంలో ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ ద్వారా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. సెప్టెంబర్, 20 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ఎపి శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ www.sand.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అమలు చేస్తున్నామన్నారు. ఈ విధానంలో ఇసుకకు ఎలాంటి ధర వసూలు చెయ్యటం లేదని, ఇసుక పూర్తిగా ఉచితమని, కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు రీచ్ నిర్వహణ , రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేయబడుతున్నాయన్నారు. ప్రతి శనివారం 70% వరకు ఉచిత ఇసుక బుకింగ్స్ స్వీకరించడం జరుగుతుందని, అలాగే అత్యవసర విధానంలో ప్రతిరోజూ 30% బుకింగ్స్ స్వీకరిస్తామన్నారు. అపార్ట్ మెంట్ లు, బహుళ అంతస్తుల నిర్మాణాలను బల్క్ ప్రోసెస్ కింద పరిగణలోకి తీసుకొని ఇసుక సరఫరాకు అవకాశం కల్పించామన్నారు. ఇందుకోసం సంబంధిత భవన నిర్మాణ యాజమాన్యం ధరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ కమీషనరు లేదా తహశీల్దార్లు ఫీల్డ్ విజిట్ చేసి ధృవీకరించిన అనంతరం ఇసుక సరఫరాకు అవకాశం కల్పిస్తామన్నారు. సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 6వ తేదీ వరకు 546 మంది 10 టన్నుల పైబడి ఇసుక బుక్ చేసుకున్నారన్నారు. ఇసుక తరిలించే లారీలకు జిపిఎస్ అమర్చి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. కుక్కునూరు మండలం ఇబ్రాహీంపేట రీచ్ లో ప్రస్తుతం 26 వేల టన్నులు ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. నిత్యం 500 టన్నులు సుమారు బుకింగ్స్ జరిగిన మరో నెల రోజుల వరకు సరిపడేలా జిల్లాలో ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. ఉచిత ఇసుక అమలులో ప్రజలకు వెసులు బాటు కల్పించేలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 8886542999, 9533922444, 9493040757, 8074462376, 9550434613, 7842684296 ఫోన్ నెంబర్లతో నిత్యం ప్రజలకు ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంటూ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి ఫెసిలిటీ సెంటర్ నుంచే కాల్ వస్తుందన్నారు. ఇంకా ఎవరికైనా ఉచిత ఇసుక విధానంలో ఏదైనా సమస్యలు
ఉంటే జిల్లాస్ధాయి టోల్ ఫ్రీ నెం. 1800-425-6025 మరియు 08812-234014 ద్వారా ఫెసిలిటీ సెంటర్ ను సంప్రదించ
వచ్చునన్నారు. ఎవరైనా వినియోగదారులు పొరుగుజిల్లా తూర్పుగోదావరి జిల్లానుండి ఇసుక పొందేందుకు ఆసక్తి కలిగియుంటే ఎరినమ్మఘాట్, దొండగుంటరేవు, ఔరంగబాద్ డి-సిల్టేషన్ పాయింట్, పంధలపర్రు, పెండ్యాల, వాడపల్లి, ఓపెన్ ఇసుక రీచ్ ల నుంచి ఇసుకును పొందవచ్చన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వినియోగదారులు ఎపి శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చన్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా జిల్లాలో నిరంతరం ఇసుక తవ్వకం జరిగేప్రదేశాలను పర్యవేక్షణ చేయబడు
తుందన్నారు. ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంచేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏదైనా అక్రమాలకు పాల్పడిన, దళారి వ్యవస్థలు ఉంటే చర్యలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ద్వారా ఉచిత ఇసుక అమలు విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే 300% అధికంగా ఎన్ఫోర్స్ మెంట్ కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకుంటే 112 కి కాల్ చేసి సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా ఫిర్యాదు అందిస్తే వాటిపై చర్యలు చేపడతామన్నారు. ఎటువంటి అపోహలకు ఎవరు తావివ్వవద్దని ఆయన సూచించారు. అంతర రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రీచ్ లకు రావటం, స్థానిక రహదారుల సమస్యల వల్ల ఉన్న ఇబ్బందులను సైతం త్వరిత గతిన అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జీలుగుమిల్లి వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేశామన్నారు.