ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.దాత్రి రెడ్డి
ఏలూరు, అక్టోబర్ 11 :ఆడపిల్లలు కేవలం ఉపాధ్యాయులు ,డాక్టర్లు ఇంజనీర్లుగా మాత్రమే కాకుండా పోలీసు,ఆర్మీ,స్పోర్ట్స్ తదితర అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు.
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వట్లురు,టీటీడీసీలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ,జాయింట్ కలెక్టర్ పి .ధాత్రి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాలికల సంరక్షణకు పాటుపడతామని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఆడపిల్లలు కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఉన్నత విద్యా అవకాశాలను అందుపుచ్చుకొని ఐఏఎస్ ,ఐపీఎస్ ,ఆర్మీ , స్పోర్ట్స్ తదితర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఎవరు ఎంచుకోనటువంటి రంగాన్ని ఎంచుకున్న కిరణ్ బేడీ ఐపీఎస్ లో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారన్నారు. కష్టతరమైన ఏ రంగన్నైనా ఎంచుకొని దానిలో ప్రావీణ్యత సంపాదించుకుంటే మీకు దానంతట అదే గుర్తింపు లభిస్తుందన్నారు. పెద్ద పెద్ద కలలు కనలని, ఆ కలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు సాధన చేయాలన్నారు .ఉన్నత స్థితికి ఎదగాలంటే దానిపై మక్కువ కలిగి ఉండాలన్నారు .బాలికలు సాధన చేస్తే సాధించలేనిది అంటు ఏమి వుండదని ఆయన స్పష్టం చేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలు, సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఒక్క బాలిక కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. దీనికి ఉపాధ్యాయులు కూడా బాలికలకు సహకారం అందించాలన్నారు. బాలికలు విద్యలో ముందంజలో ఉన్నారనటానికి నూజివీడులో ఉన్న త్రిబుల్ ఐటీ నిదర్శనమాన్నరు. అక్కడ 70 శాతం మంది బాలికలు చదువుకుంటున్నారన్నారు. బాల్య వివాహాలువల్ల కలిగే అనర్ధాలు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలకు అన్యాయం జరగకుండా ఉండాలన్నారు .సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయని ఆ సమస్యల పట్ల పోరాడి గెలుపొందాలని ఈ సందర్భంగా బాలికలకు ఎస్పి హితవు పలికారు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుందని దానిని చిగురించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో 1098, మరియు 100 ఫోన్ నెంబర్లకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా బాలికలు నిర్వహించిన నృత్య పరదర్శన బాగుందని పేర్కొంటూ వారందరిని జిల్లా ఎస్పీ అభినందించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ పి .దాత్రి రెడ్డి మాట్లాడుతూ బాలికలకు సామాజికంగా, ఆర్థికంగా ,మానసికంగా భరోసానివ్వాలన్నారు. బాలికల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం తరపున వారికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. బాల్యవివాహాలు, లైంగిక దాడులు లింగ వివక్షత ,ఆరోగ్య సమస్యలు వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా బాలికలలో చైతన్యం కల్పించాలన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్ల అంటే భారం కాదని వారు తమ ఆస్తి అని తల్లిదండ్రులు గర్వపడే విధంగా ఎదగాలన్నారు. సమాజంలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ప్రభుత్వం బేటి బచావో ..బేటి పడావో అన్న నినాదంతో విభిన్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వాటి ద్వారా నైపుణ్యాన్ని చదువులో ,క్రీడల్లో చూపించాలని ఆమె సూచించారు. బాలికలను సంరక్షించుకునే బాధ్యత, వారిని చదివించి వారికి సమాన హక్కులు కలిగేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉండాలని బాలికలకు జాయింట్ కలెక్టర్ సూచించారు. ఆడపిల్లల సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
ఈ సందర్భంగా బాల్యవివాహాలను ఎదుర్కొని బాల్యవివాహాల నుంచి బయటపడి చదువుకుంటున్న పలువురు బాలికలు తమ అనుభవాలను వివరిస్తూ బాగా చదువుకుని ఉపాధ్యాయులుగా ఇంజనీర్లుగా,డాక్టర్లుగా ఎదుగుతామని తెలిపారు .ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రతిభావంతులుగా ఉన్న నాయకుల వేషధారణలో పలువురు బాలికలు అందరినీ ఆకర్షించారు. అనంతరం జిల్లాలో ఉన్న బాలికలు జాతీయ స్థాయిలో వారి వారి ప్రతిభను కనపరచి వివిధ రంగాల్లో జాతీయస్థాయిలో అవార్డులు పొందిన బాలికలు అందరికీ మెరిటోరియస్ సర్టిఫికెట్స్ ను అందజేశారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన తొమ్మిది మంది బాలికలకు సర్టిఫికెట్స్ ని అందజేశారు .అదే విధంగా బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. అనంతరం టిటిడిసి ఆవరణలో జిల్లా ఎస్పీ ,జిల్లా జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటారు .
ఈ కార్యక్రమంలో డిఆర్ డిఎ పిడి ఆర్. విజయ రాజు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి ,జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఆర్. నాగరాణి, డిసిపిఓ సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు.