Close

అర్జీల పరిష్కార తీరు నాణ్యతగా వుండాలని అధికారుల‌ను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 15/10/2024

ఏలూరు,అక్టోబర్ 15 : అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన పరిష్కారాన్ని వేగవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) లో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్ ఓ డి.పుష్పమణి ,డిఆర్డీఏ పీడి ఆర్ . విజయరాజు,ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం.ముక్కంటి,కె.భాస్కర్ లతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌ పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ కు ప్రజల నుంచి 81 విన‌తులు అందాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ
పీజీఆర్ఎస్ లో ప్ర‌జ‌ల నుంచి అందిన ప్రతి అర్జీల‌కు ప‌రిష్కారం చూప‌డంలో అధికారులు ప్ర‌త్యేక చొర‌వ చూపాల‌న్నారు.
ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.

*ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..

ద్వారకా తిరుమల మండలం సండ్రుగుంటకు చెందిన చిగురుపాటి మోహన్ రావు అర్జీనిస్తూ తనకు తెలియకుండా తన పిల్లలు ఇల్లు తాకట్టు పెట్టి మోసం చేశారని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్, ద్వారకాతిరుమల సబ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.

శనివారం పేటకు చెందిన బొడ్డు రామానుజయ వినతిపత్రం ఇస్తూ 26వ డివిజన్ శనివారపేట కుమ్మరి గొయ్యి రోడ్డుపై అక్రమంగా షాపులు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.

కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన దొడ్డి శివ నాగమల్లేశ్వరి అర్జీనిస్తూ తనకు వివాహమై 20 సంవత్సరాలు అయిందని, ఇద్దరు కుమారులు ఉన్నారని అయితే తన భర్త మద్యానికి అలవాటు పడి చిత్రహింసలు పెడుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వాపోయింది, తన కుటుంబ పోషణార్థం తన భర్త నుంచి భరణం ఇప్పించాలని, రక్షణ కల్పించాలని కోరారు.దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ పిడిని ఆదేశించారు.

చింతలపూడి మండలం కాంచనగూడెం కు చెందిన బోయిన అక్కమ్మ వినతిపత్రం ఇస్తూ ప్రగడవరంలో తమ భూమిని మల్లయ్య గూడెం చెందిన వారు ఆక్రమించారని ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.