పది రూపాయల బిళ్ళలు తప్పనిసరిగా తీసుకోవాలి కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా, ఏలూరు: అక్టోబర్, 30: రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అనుసరించి పది రూపాయల బిళ్ళలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. పలు దుకాణాల వారు పది రూపాయల బిళ్ళలు తీసుకోవడం లేదని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు కలెక్టర్ కు విన్నవించారు. వెనువెంటనే స్పందించిన కలెక్టర్ చెల్లుబాటు లో ఉన్న పది రూపాయల బిళ్ళలు తీసుకోకపోతే చిల్లర సమస్య తలెత్తుతుందన్నారు. బ్యాంకుల ద్వారా, మీడియా ద్వారా పది రూపాయల బిల్లల చెల్లుబాటును ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలన్నారు. ప్రజల్లో, దుకాణదారులలో పది రూపాయల బిళ్ళలు వాడకంలో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. అలాగే ఇటీవల కాలంలో కలెక్టర్ సమస్యల పరిష్కార ఫోన్ నెంబర్ ద్వారా కామవరపుకోట మండలం లో ఉన్న ఎండు చెట్లను తొలగించడం, సౌత్ సెంటర్లోని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం పనులను పూర్తి చేసినందుకు కలెక్టర్ మరియు టీమ్ మెంబర్స్ కు సహాయ పౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు కృతజ్ఞతలు తెలియజేశారు.