తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
ఏలూరు, నవంబరు, 5: తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన దృష్ట్యా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంబంధిత వివరాలను మీడియాకు డిఆర్ఓ విశ్వేశ్వరరావు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిందన్నారు. నవంబరు 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. అదే రోజునుంచి నవంబరు 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. డిశంబరు 5న పోలింగ్, డిశంబరు 9న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ దృష్ట్యా తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను(ఎంసిసి) అమలు చేయడం జరుగుతుందన్నారు.