జిజిహెచ్ లో నవజాత శిశువుల ఐసియు ఏర్పాటుకు ప్రతిపాధనలు సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,నవంబరు,8: జిల్లాలో మాతృ శిశు మరణాలు సంబవించకుండా ప్రతిదశలోను వైద్య ఆరోగ్య ,మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన లింగ నిర్ధారణ నిషేధ చట్టం – 1994 అమలుపై జిల్లాస్ధాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అధారిటీ సలహాకమిటీ , మరియు జిల్లా ఎండిఎస్ఆర్ , సిడిఎస్ఆర్ జిల్లాస్ధాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మాతా శిశు మరణాలను గణనీయంగా నియత్రించేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపై అనుభవజ్ఞులైన వైద్యులతో సంబంధిత వైద్యులకు ఓరియంటేషన్ నిర్వహించాలని డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ లను ఆదేశించారు. గత మూడేళ్లలో సంభవించిన మాతా శిశు మరణాల సంబంధించి కేస్ స్టడీ, ఏరకమైన వైద్యం అందిస్తే మరణాలను తగ్గించకలిగే అంశాలను విశ్లేషించాలన్నారు. తల్లివయస్సు తక్కువ, ఇతర కారణాలతో ఆకస్మిక గర్భస్త్రావాలకు అవకాశం ఉన్న ప్రమాదకారకాలను గుర్తించి అందుకు అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో ప్రసవసమయంలో సంబంధిత వ్యక్తికి సంబంధించిన బ్లడ్ గ్రూపుతోకూడిన రక్తాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. రక్తహీనత, తదితర లోపాలతో హైరిస్క్ గర్భిణీలు, ప్రసవం పూర్తయ్యేవరకు ఆయా సిడిపివోల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు పర్యవేక్షణ అత్యంత అవసరమన్నారు. ఈ విషయంలో వారికి ఓరియంటేషన్ , కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జిజిహెచ్ లో నవజాత శిశువుల ఐసియు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలతో ప్రతిపాధనలు నివేదించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గర్భస్ధ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన వారికి చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గర్భస్ధ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పీసి పీఎన్ డిటి చట్టం అమలుతీరు, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలను ఎన్ జివోల ప్రతినిధుల సమన్వయంతో సంబందిత అధికారులు ముమ్మరం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, రెవిన్యూ, పోలీస్, అధికారులు సమన్వయంతో పనిచేసి గర్భస్ధ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసి పీఎన్ డిటి) చట్టం పటిష్ట అమలుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లలో ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. స్కానింగ్ ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. డివిజన్ స్ధాయితోపాటు మండల స్ధాయిలో వేసిన కమిటీలు గర్భస్ధ లింగ నిర్ధారణ నిషేధచట్టం అమలుపై సమావేశాలు నిర్వహించాలన్నారు. మరి ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఆదేశాలు ప్రకారం మందుల విక్రయం నిర్వహణ చేపడుతున్నదీ లేనిదీ డ్రగ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వైద్యులు ఇచ్చిన మందుల చీటీ ప్రకారమే మెడికల్ షాపుల్లో సంబంధిత మందులు విక్రయించాలన్నారు. దీనిపై సంబంధిత అదికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని తనిఖీలలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా గత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. బాలిక సంరక్షణకు గ్రామస్ధాయిలో ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల సిబ్బంధిని బాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన బాలికలకు, గర్భిణీస్త్రీలకు లింగ నిర్ధారణ స్కానింగ్ పై అవగాహన కల్పించాలని తరచూ క్షేత్రస్ధాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలను పరిశీలించాలన్నారు.
సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. ఎస్. శర్మిష్ట, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, డిఇఓ వెంకటలక్ష్మీ, డిసిపివో డా. సూర్యచక్రవేణి, జిజిహెచ్ ఆర్ఎంఓ సిహెచ్ శ్రీనివాసరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజీవ్, పలువురు వైద్యులు, ఎన్ జివోలు పాల్గొన్నారు.