7వ జాతీయ గ్రంథాయల వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు, నవంబర్,14: పుస్తక పఠనం వికాసాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్ధ ఆధ్వర్యంలో స్ధానిక జిల్లా గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా పుస్తక పఠనంపై కార్యక్రమంలో పాల్గొన్నవారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్ధినులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలుత గ్రంథాయలంలోని సందర్శన పుస్తకంలో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలావాటు వల్ల లక్ష్యాన్ని నిర్ధారించుకొనే స్పృహ ఏర్పడుతుందని తద్వారా లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుందని స్పష్టం చేశారు. పుస్తకం చదివే రుచి ఒకసారిచూస్తే పుస్తక పఠనాన్నివదిలే ప్రసక్తే ఉండదన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతో వారి తెచ్చిన పుస్తకాలను చదవడం మూలంగానే నేడు ఈస్ధాయికి చేరుకోగలిగానని ఆనాటి పుస్తక పఠనం మధుర స్మృతులను కలెక్టర్ వెట్రిసెల్వి పిల్లలకు వివరించారు. పుస్తకాలు చదివినవారు లోకజ్ఞానంలోనే కాకుండా రకరకాల సామార్ధ్యాలలోను మెరుగైన ప్రతిభను కనపరుస్తున్నారన్నారు. పుస్తకాలు చదవడం అనేది సాహిత్య పరిచయానికో, కాలక్షేపానికో కాదని పుస్తక పఠనం వల్ల మానసిక పరిధి విస్తరిస్తుందన్నారు. టీనేజిలోనే తప్పనిసరిగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. మంచి పుస్తకాలు చదవడం మూలంగా మన జీవితంపై మంచి ప్రభావాన్ని తీసుకొస్తుందన్నారు. విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రలకు చెందిన బయోగ్రఫీలను చదవాలని సూచించారు. విద్య ఒక్కటే సమాజాభివృద్ధికి పెద్ద ఆయుధమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ బాగా చదవి విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతిఒక్కరిలో చదవాలనే కోరిక ఉండాలేగానీ సమయం తప్పకుండా దొరుకుతుందన్నారు.
కార్యక్రమంలో నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భాను ప్రతాప్, జిల్లా గ్రంథాయల సంస్ధ కార్యదర్శి ఎం. శేఖర్ బాబు, వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకరరావు, తహశీల్దారు వి. శేషగిరి, డిప్యూటీ లైబ్రరియన్ ఎ. నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.