Close

ఉద్యానవన రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తాం- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 21/11/2024

ఏలూరు, నవంబర్, 21 : ఏలూరు జిల్లాలో ఉద్యానవన సాగులో 20 శాతం వృద్ధిరేటు సాధించడానికి రైతులను అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో గురువారం సుస్థిర ఆయిల్ పామ్ అభివృద్ధి కి తీసుకోవలసిన చర్యలకు సంబంధించి జిల్లాలో ఆయిల్ పామ్, ఇతర ఉద్యానవన పంటల వృద్ధి పై రైతుల సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై రైతులకి అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని, ఏలూరు జిల్లాలో 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. ఆయిల్ పామ్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకువెళ్లేందుకు రైతులు కృషి చేయాలన్నారు. ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు నీటి లభ్యత, వాతావరణం, భూసారం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకుని మరింత అధిక విస్తీర్ణంలో ఆయిల్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు 40 సంవత్సరాలకు పైగా ఉంటుందని, రైతులకు ఇది దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే పంట ని కలెక్టర్ చెప్పారు. అంతేకాక ఆయిల్ పామ్ సాగులో కోకో, బ్లాక్ పెప్పర్ వంటి అంతర పంటల సాగు ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ఆయిల్ పామ్ సాగులో సుస్థిర అభివృద్ధి సాదించేందుకు ఎన్నో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉద్యానవన రైతులకు సాగులో యాంత్రీకరణతో పాటు డ్రిప్, మైక్రో ఇరిగేషన్ వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
ఆయిల్ పామ్ అభివృద్దితో రాష్ట్ర జిడిపి పై కూడా వృద్ధి చెందుతుందన్నారు. ఆయిల్ పామ్ పరిశోధనాలయం కూడా మన జిల్లాలో ఉండడం, జిల్లాలో అధిక దిగుబడి సాధనకు శాస్త్రవేత్తల సూచనలు కూడా కారణమన్నారు. రీసెర్చ్ సెంటర్లో నూతన పరిశోధనల ఫలితాలను, విస్తరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కలిగించడంతోపాటు, సాగులో వారి సమస్యలను కూడా తెలుసుకుని సందేహాలను తీర్చాలని కలెక్టర్ శాస్త్రవేత్తలను కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో రైతులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని, జిల్లాలో జరుగుతున్నా ఆయిల్ పామ్ సాగు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలలోను పాటిస్తూ అధిక దిగుబడి సాగిస్తున్నారన్నారు. ఆయిల్ పామ్ సాగులో సూక్ష్మ, డ్రిప్ సేద్య విధానానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, రైతులు వినియోగించుకోవాలన్నారు. యాంత్రీకరణ, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ విధానాల ద్వారా తక్కువ మొత్తంలో ఎరువుల వినియోగంతో సాగు ఖర్చు నియంత్రించుకోవడంతోపాటు సాగు ఖర్చు తగ్గుతుందన్నారు.
అనంతరం ఆయిల్ పామ్ అధిక దిగుబడి సాధనకు కృషిచేసిన రైతులు, శాస్త్రవేత్తలను సన్మానించి మెమెంటోలను జిల్లా కలెక్టర్ అందజేశారు.
కార్యక్రమంలో సీనియర్ ప్రొగ్రమ్మె మేనేజర్ హిమాంశు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రవికుమార్, ఆయిల్ పామ్ రెసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. . కె. సురేష్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్స్ లు డా. టి. సుశీల, డా. ఎం.వి. ప్రసాద్, డా. పి. మాధవీలత,డా. గోవర్ధన్, డా. ఎన్ .బివి. చలపతిరావు, గోద్రెజ్ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి. మురళీధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యానవనల పెంపకం, డ్రిప్, మైక్రో ఇరిగేషన్ ల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తదితర అంశాలపై ఉద్యానవన, మైక్రో ఇరిగేషన్ శాఖలు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను కలెక్టర్ పరిశీలించారు.