ఏలూరు జిల్లాలో రానున్న రబీ సీజన్ లో సాగునీటికి, వేసవిలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు.
ఏలూరు, నవంబర్, 21 : ఏలూరు జిల్లాలో రానున్న రబీ సీజన్ లో సాగునీటికి, వేసవిలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం ఏలూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రానున్న రబీ సీజన్లో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో 82 వేల 251 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రబీ సీజన్లో గోదావరి పశ్చిమ డెల్టా ఆయకట్టుకు, జిల్లాలో త్రాగునీటి అవసరాలకు 91. 35 టిఎంసి ల అవసరం అవుతుందని అంచనా కాగా, 68. 40 టిఎంసీ లు లభ్యత ఉంటుందని అంచనా వేశామని, మిగిలిన నీటిని సీలేరు, ఇతర నీటి వనరుల ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. రబీ పంకు సాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలన్నారు. పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలోని కాలువలకు 2025, ఏప్రిల్, 15వ తేదీన కాలువలు మూసివేయాలని, , తిరిగి 2025, జూన్, 1 వ తేదీన కాలువలకు నీటి ని విడుదల చేయాలని సమావేశం తీర్మానించిందన్నారు. గోదావరి లో నీటి లభ్యత ననుసరించి పోలవరం, గూటాల, ఎర్రకాలువ ఎత్తిపోతల పధకాల ద్వారా సాగునీరు విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ఇటీవల వరదల కారణంగా నూజివీడులో పెద్దచెరువు, బుడమేరు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తం అయిందని, దీని దృష్ట్యా మైనర్, మేజర్ నీటి వనరులకు మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా బలివే పుణ్యక్షేత్రం నకు తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుండి 50 ఎంసీఎఫ్ టి నీటిని 5 రోజులపాటు సరఫరా చేయాలనీ నిర్ణయించామన్నారు.
సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథబాబు, మత్య్స శాఖ జెడి నాగలింగాచార్యులు, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.