Close

కిషోరి వికాసం-2.0 శిక్షకుల శిక్షణా కార్యక్రమం ద్వారా పూర్తిస్ధాయిలో అవగాహన పెంచుకోవాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 27/11/2024

ఏలూరు,నవంబరు,27: జిల్లాస్ధాయి నుంచి మండల, గ్రామస్ధాయి వరకు ప్రతి స్ధాయిలోను కిషోరి వికాసం-2.0 స్ధాయిలో శిక్షకుల శిక్షణా కార్యక్రమం ద్వార అవగాహన పెంచుకొని పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం-2.0 జిల్లాస్ధాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమం జిల్లా ఐసిడిఎస్ పిడి కె. పద్మవతి అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. అనంతరం బాల్యవివాహాల వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు, శిక్షణా కార్యక్రమానికి హాజరైన శిక్షణ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. తదుపరి కిషోరి వికాసం-2.0 కిషోరి బాలికా స్వేచ్ఛా సంపూర్ణ సాధికారిత కోసం ఏలూరు జిల్లాకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మహిళా అభివృద్ధి మరియు శిశుసంక్షేమ శాఖ అధికారులు కిషోరి వికాసం శిక్షకుల శిక్షణా కార్యక్రమం ద్వారా జిల్లాస్ధాయి శిక్షణ అందించడానికి నియమించిన టీమ్ సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పూర్తిస్ధాయిలో అవగాహన కలిగి తద్వారా మండల , గ్రామస్ధాయి సభ్యులకు శిక్షణ ఇచ్చి కిషోర్ వికాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

బాలికల సంరక్షణపై ప్రత్యేక శ్రద్దచూపడంతోపాటు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు వాటినుండి బాలికలు ఎదుర్కొనే మార్గాలు గురించి అవగాహన కల్పిస్తారని, బాల్యవివాహాల నివారణ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాల్య వివాహాలు జరగడం వలన ఆడపిల్లలు భవిష్యత్ లో ఎదుర్కొనే సమస్యలు గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, పాఠశాల ఉపాధ్యాయులు బాల్యవివాహాల జరిగే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, టోల్ ప్రీ నెం. 1098 కు చేరవేయాలని చెప్పారు. బాల్యవివాహాల చట్టం ప్రకారం 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు బాల్య వివాహాలు నిషేధమని అన్నారు.
బాలికలకు విద్యా, న్యూట్రిషన్, ఐరన్ లోపం, ఆరోగ్యం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, యోగా, ఫిట్ నెస్ తదితర అంశాలపై శిక్షణ లో ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఏలూరు జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బాలహక్కుల కమీషన్ సభ్యులు రాజేంధ్రప్రసాద్, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిఎంహెచ్ఓ ఇన్ చార్జి డా. జ్యోతి, డిసిపివో సిహెచ్ సూర్యచక్రవేణి, మాస్టర్ ట్రైనీస్, వివిధ ప్రభుత్వ శాఖల కమిటీ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.