Close

విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.

Publish Date : 28/11/2024

పెదవేగి, నవంబర్, 28 : విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. పెదవేగిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను గురువారం ఆయన జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందన్నారు. క్రీడలలో విజయం అనేది నిరంతర అభ్యాసంతో సాధ్యపడుతుందన్నారు. ఉపాధ్యాయులు క్రీడల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు, క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని , క్రీడల అభ్యాసనకు అవసరమైన బూట్లు, క్రీడా సామాగ్రిని ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థినీ,విద్యార్థులకు అందిస్తున్నదన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయుల వివరాలు ఫొటోలతో సహా తమ శాఖ ప్రచురించే మ్యాగజైన్ లో ప్రచురించి మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యాన్ని కొనలేమని కోవిడ్ అందరికీ పాఠాలు నేర్పిందన్నారు. గతంలో అందరూ పాఠశాలల్లో ఎన్నో రకాల క్రీడల ప్రాక్టీస్ చేసేవారని, పెద్దలు కూడా శారీరక శ్రమతో ఎంతో ఆరోగ్యంతో ఉండేవారన్నారు. కానీ ప్రస్తుతం టి.వి., లు, వీడియో గేమ్లు, స్మార్ట్ ఫోన్ లలో గేమ్ లతో సరిపోతుందని, ఎటువంటి శారీరక శ్రమ లేనికారణంగా శారీరక దృఢత్వం లేకుండాపోతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్ జాడ్యం లేకపోవడంతో నిజమైన క్రీడలను అభ్యసిస్తున్నారని, ఇది ఆనందించదగిన విషయమన్నారు.
కార్యక్రమంలో APSWREI సంస్థ అకాడమిక్ మానిటరింగ్ అధికారి . N. సంజీవరావు , A. ముళ్ళ కృష్ణ B.V మల్లెశ్వ రావు గారు(AMO) ఏలూరు జిల్లా APSWREIS సంస్థ ఏలూరు, తూర్పు, కృష్ణా జిల్లాల సమన్వయ అధికారులు . N. భారతి, జి. వెంకటరావు, కె. ప్రేమావతి, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను అలరించాయి.