Close

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.

Publish Date : 08/01/2025

ఏలూరు, జనవరి, 8 : రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పేదలకు ఆహార భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నదని, కొందరు ఆ బియ్యాన్ని పక్కదారులు పట్టిస్తున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా మరింత నిఘా పెట్టి అక్రమార్కులపై 6ఏ కేసులు నమోదు చేయాలనీ అధికారులను ఆదేశించారు. కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే వ్యవస్థలో భయం ఉంటుందన్నారు. ప్రతీ శనివారం 6ఏ కేసులను విచారించి, నిందితులకు వెంటనే జరిమానా, శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారులను జేసీ ఆదేశించారు. పౌర సరఫరాలు, పోలీసు, తూనికలు కొలతల శాఖల అధికారులు కలిసికట్టుగా ప్రతీవారం దాడులు నిర్వహించాలని, చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె. సత్యనారాయణరాజు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.