ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిభిరాలు.. పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, జనవరి, 19: జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిభిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం స్ధానిక కలెక్టరేట్ పశుసంవర్ధకశాఖ ఆద్వర్యంలో నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుతవం పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగినన్ని నిధులు కేటాయిస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. ఈ క్రమంలో పశువుల ఆరోగ్యానికి ఉత్పాధకను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశుపోషణ ఖర్చు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణకు జిల్లాలో గల 27 మండలాల్లో మండలానికి రెండు టీములు చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క టీములో ఒక పశు వైద్యుడు, ఒక పారా వెటరినరీ సిబ్బంది, పశువైద్య సహాయకులు ఇంకా గోపాలామిత్రులు వుంటారన్నారు.
ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఇన్ చార్జి జెడి డా. టి. గోవిందరాజు మాట్లాడుతూ ఈ పశు ఆరోగ్య శిభిరాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించడం, అదేవిదంగా లేగదూడలకు, పాడి పశువులకు కూడా నట్టల నివారణ మందులు త్రాగించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అనారోగ్యంగా వున్న పశువులకు చికిత్స చేస్తాము, గర్భకోశ వ్యాధులకు, ఎదకురాని పశువులకు, తిరగపొర్లు పశువులకు పరీక్ష చేసి చికిత్స అందజేస్తున్నామన్నారు. దీంతో పాటుగా 14 మండలాల్లో లేగదూడల అందాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాడి రైతులను ఉత్సాహపరిచేందుకు, లేగదూడల పెంపకం పట్ల అవగాహన కలిగించేదుకు ఈ లేగదూడల అందాలప్రదర్శనని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అందాలప్రదర్శనకు విచ్చేసిన అన్ని లేగదూడలకు ఖనిజమిశ్రమ లవణాలుగల పేకట్లను ఎదుగుదలకు పనికొచ్చే మందులను ఇవ్వడమే కాకుండా, అందాలప్రదర్శనలో గెలిచిన లేగదూడల రైతులకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. ఈ క్యాంపుల గురించి రైతుల్లో అవగాహన కలిగించడానికి పోస్టర్లు, కరపత్రాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. కాబట్టి జిల్లాలో గల రైతు సోదరులందరు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని కోరారు.