Close

దేవాదాయ శాఖ, రెవిన్యూ, పోలీస్ జాయింట్ తనిఖీ నిర్వహించాలి. జిల్లాకలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లాస్ధాయి కమిటీ సమావేశం.

Publish Date : 22/01/2025

ఏలూరు, జనవరి 22: జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణకు జిల్లాయంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో భూ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ నేపధ్యంలో బుధవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూముల పరిరక్షణ, లీజుదారుల నుండి లీజు మొత్తాలను వసూలుచేయడం తదితర అంశాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. జిల్లాలో25 మండలాల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను మండలాల వారీగా సమగ్ర నివేదికను తయారుచేసి శుక్రవారం నాటికల్లా వివరాలు సమర్పించాలని కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలో మండలాల్లో ఉన్న దేవాదాయ శాఖ మొత్తం భూమి (సర్వే నెంబర్లతో), అన్యాక్రాంతమైన భూమి, లీజుకిచ్చిన భూమి, ఖాళీగా ఉన్న భూమి, సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించారు. దీని ఆధారంగా రెవిన్యూ పరంగా చేయవల్సిన ప్రక్రియను సంబంధిత రెవిన్యూ డివిజనల్ అధికారి, మండల తహశీల్దార్లకు తెలియపర్చాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ భూముల పరిరక్షణకు సూచించిన మార్గదర్శకాలను సంబంధిత శాఖ అధికారులు అధ్యాయనం చేసి దేవాదాయ భూముల పరిరక్షణకు సమిక్షిగా కృషిచేయాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనరు వి. హరిసూర్యప్రకాష్, ఆర్డివోలు అచ్యుత అంబరీష్, ఎం.వి. రమణ, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానూప్రతాప్, డిపివో కె. అనురాధా, ల్యాండ్ సర్వే ఎస్ హెచ్ ఎండి అన్సారీ, జిల్లా రిజిస్ట్రార్ కె. శ్రీనివాసరావు, వివిధ దేవాలయాల ఇవోలు, ఇన్స్పేక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.