పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 232. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,జనవరి 27: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ(పిజిఆర్ఎస్) ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిజిఆర్ఎస్ అర్జీలను ప్రజలనుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈరోజు 232అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను వివిధ శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వారి సిబ్బందితో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందిన అర్జీలు నాణ్యత ప్రమాణాలతో అర్జీదారునికి ఎండార్స్ మెంట్ చేయాలని తెలిపారు. అర్జీలు రీఓపెన్ కాకుండా అధికారులు అర్జీలో పొందుపర్చిన అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు.
అందిన అర్జీలలో కొన్ని..
ఏలూరు శ్రీరామనగర్ కు చెందిన కె. పార్వతి ఆధార్ కార్డు లేదని వృద్ధాప్య పింఛన్ తనకు ఇవ్వడం లేదని ఆధార్ కార్డు అప్ డేట్ చేయించి వృధాప్య పించన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ అర్జీ అందజేశారు. జంగారెడ్డిగూడెం పేరంపేట కు చెందిన బి. శంకరరావు దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల సెకిల్ ను ఇప్పించమని అర్జీ అందజేశారు. ఆగిరిపల్లి మండలం వడ్డిగుడిపాడుకు చెందిన ఎం. సుబ్బారావు తాను ఐటిఐ ఎలక్ట్రికల్ చదివి నిరుద్యోగిగా ఉన్నానని, కావున తనకు విద్యుత్ శాఖ కార్యాలయంలో షిఫ్టు ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. పెదపాడు మండలం జయపురం కు చెందిన ఎం. నక్షత్రరావు తమ పొలం సర్వే నెంబరును తమయొక్క అంగీకారం లేకుండా మార్చుతున్నారని దానిని మార్చకుండా చూడాలని అర్జీ అందజేశారు. మండవల్లి మండలం లింగాల గ్రామంకు చెందిన పి. వెంకటేశ్వరమ్మ తన భర్త మరణించిన కారణంగా తాను ఆర్ధికంగా సమస్యలు ఎదుక్కొంటున్నానని ప్రభుత్వం వితంతువులకు అందజేస్తున్న పింఛన్ ను ఇప్పించవలసిందిగా అర్జీ అందజేశారు.
సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.