పోలింగ్ కు సర్వం సిద్ధం..
ఏలూరు, ఫిబ్రవరి,25: ఈనెల 27వ తేదీన జరుగనున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో పట్టభధ్రుల ఓటుహక్కు వినియోగించుకునేందుకు 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 3,14,984 మంది పట్టభధ్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి 66 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్ల ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటర్ల స్లిప్పులు అందజేశారు. అయితే వీటికి తోడుగా ఎదోఒక గుర్తింపు కార్డుతో ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఈ ఎన్నికలకు సంబంధించి 54 మంది నామినేషన్లు సమర్పించగా వీటిలో 11 నామినేషన్లు తిరస్కరించగా మరో 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 35 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 545 మంది ప్రెసైడింగ్ అధికారులు, 545 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 1080 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 544 మంది మైక్రోఅబ్జర్వర్ల తో కలిసి 2,714 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో పోలీస్ ఫోర్సెస్ కు సంబంధించి 8 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, 37 మంది ఎస్సైలు, 69 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 221 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర భధ్రతా సిబ్బందితో కలిసి 477 మందిని పోలింగ్ ప్రక్రియకు వినియోగించుకోనున్నారు. పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి 70 మంది జోనల్ అధికారులను, 99 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. ఏలూరు జిల్లాకు సంబంధించి 10 మంది జోనల్ అధికారులు, 14 మంది రూట్ అధికారులను నియమించారు.
ఏలూరు జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ కు సమీపంలోని గిరిజన భవన్, జంగారెడ్డిగూడెంలో ఆర్డిఓ కార్యాలయంలో ఈనెల 26వ తేదీన ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ ఓటింగ్ కు సంబంధించి 1199 బ్యాలెట్ బాక్సులు కేటాయించగా ఏలూరు జిల్లాలో 217 బ్యాలెట్ బాక్సులు కేటాయించడం జరిగింది.
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి సమాచారం..
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లాలో 8 మండలాల్లో 21 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలో 16,099 ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 150 మందిని ఎన్నికల సిబ్బందిని నియమించారు. పోలింగ్ కు 80 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
నూజివీడులో ఈనెల 26వ తేదీన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఎన్నికల సామాగ్రిని అందజేస్తారు.
ఈనెల 27వ తేది సాయంత్రం 4 గంటల వరకు డ్రై డేగా మద్యం దుకాణాల ను మూసివుంచాలని ఉత్తర్వులు జారీచేశారు.