Close

రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.. ఎన్నికల్లో జోనల్ అధికారులపాత్ర కీలకం.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 25/02/2025

ఏలూరు,ఫిబ్రవరి,25: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో రిసెప్షన్ సెంటర్ లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, మరియు సెక్టార్ అధికారులు, రూట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన పిదప రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి స్వీకరణ ప్రక్రియను అత్యంత శ్రద్ధతో నిర్వర్తించాలన్నారు. రిసెప్షన్ సెంటర్ కు చేరే బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ అక్కౌంట్, పివో డైరీ, పేపర్ సీల్ అక్కౌంట్ ఇతర డిక్లరేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. స్టాట్యూటరీకి సంబంధించి 7 రకాల పత్రాలతోకూడిన ప్యాకెట్, నాన్ స్టాట్యూటరీకి సంబందించి 6 పత్రాలతో కూడిన సీళ్లు కవర్లను జాగ్రత్తగా తీసుకొని పరిశీలించాలన్నారు. అదే విధంగా పివో హ్యాండ్ బుక్, ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించి 6 రకాల వస్తువులను కూడా స్వీకరించవలసివుంటుందన్నారు. ప్రతి డాక్యుమెంట్ ను పరిశీలించుకోవాలని, పరిశీలన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూం కు చేరవేయాలన్నారు. అదే విధంగా మైక్రోఅబ్జర్వర్ నివేదికను, వెబ్ కాస్టింగ్ కు సంబంధించిన రిపోర్టును కూడా సేకరించాలన్నారు. అనంతరం జోనల్ అధికారులు సెక్టార్ అధికారులతో కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల్లో జోనల్ అధికారులపాత్ర కీలకమన్నారు. వారి పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్ల కు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ నమోదు వివరాలు తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బందిపై పూర్తిస్ధాయిలో అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను, తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు వచ్చే వాహనాలను మార్గమద్యంలో ఎక్కడా నిలుపుదల చేయకూడదన్నారు. సెక్టార్ అధికారులు వారికి నిర్ధేశించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.

రిసెప్షన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రి స్వీకరణపై మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్, ఫణిలతో పాటు డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిసిఓ శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, డ్వామా పిడి సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, దేవకిదేవి, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, హౌసింగ్ పిడి సత్యనారాయణ, పౌర సరఫరాల సంస్ధ డిఎం వి. శ్రీలక్ష్మి, సెట్ వెల్ సిఇఓ ప్రభాకర్, ఎడి సర్వే అన్సారి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య పాల్గొన్నారు.