Close

అంగన్వాడీ కేంద్రాలలో మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి-పి . ధాత్రిరెడ్డి… భీమడోలు మండలంలో జెసి ధాత్రి రెడ్డి సుడిగాలి పర్యటన

Publish Date : 05/03/2025

ఏలూరు/ భీమడోలు, మార్చి , 5 : అంగన్వాడీ కేంద్రాలలో మహిళలు, పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.

భీమడోలు మండలంలో బుధవారం జేసీ సుడిగాలి పర్యటన చేసి వివిధ శాఖల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాతూరు లోని ఎంపిపి స్కూల్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జేసీ సందర్శించి, అక్కడ మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ మహిళలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం, రక్తహీనత నివారించడం ద్వారా మాతా ,శిశు మరణాలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందిస్తున్నదని, ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టికాహారాన్ని మహిళలు, పిల్లలకు అందించేలా అంగన్వాడీ సిబ్బంది పనిచేయాలన్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి వాక్సినేషన్ చేయించాలన్నారు. అంగన్వాడీ లోని ప్రీ స్కూల్ లో పిల్లలకు విద్య పట్ల ఆసక్తి కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఏలూరు కాలువలో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను జేసీ పరిశీలించారు. తూడు,గుర్రపుడెక్క తొలగింపు పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసి, శివారు గ్రామాలకు త్రాగు, సాగు నీరు అందేలా చూడాలన్నారు. అనంతరం గుండుగొలనులో ఎండి యు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేషన్ అందించాలన్నారు. అనంతరం సూరప్పగూడెంలో రీ సర్వే పనులను పరిశీలించారు. అనంతరం భీమడోలు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని రికార్డులను పరిశీలించారు.

జాయింట్ కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, ఇరిగేషన్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగార్జునరావు, సర్వే ఏడి అన్సారి,తహసీల్దార్ రమాదేవి, ఐసిడి ఎస్ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.