Close

దళారుల ప్రమేయం లేకుండా ఆర్ అండ్ ఆర్ సర్వే గ్రామ సభలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 10/03/2025

ఏలూరు, మార్చి , 10 : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో లబ్ధిదారులు గుర్తింపు, పరిహారం లెక్కింపునకు నిర్వహించే గ్రామ సభలలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అర్హులైన లబ్దిదారులనుండే వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి సర్వే పై గ్రామ సభల నిర్వహణపై స్థానిక కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావితున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని భావిస్తున్నదన్నారు. ఇందుకు సహకరించే నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్హుడైన ప్రతీ నిర్వాసితునికి నిబంధనల ననుసరించి పరిహారం అందించాల్సి ఉందని, ఇందుకోసం ముంపు గ్రామాలలో అర్హులైన నిర్వాసితులను గుర్తించి, వారి సమస్యలు తెలుసుకుని, వారి భూమి, కట్టడాలు, పంట, చెట్లు, తదితరాలకు సంబంధించి పరిహారాలు లెక్కింపునకు ప్రతీ గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా వివరాలు సేకరించి, నివేదికలు సమర్పించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులై, గతంలో చేసిన సర్వేలో తమ వివరాలు నమోదు కానీ నిర్వాసితుల వివరాలను సేకరించాలని, వారికి చెల్లించాల్సిన పరిహారంపై నివేదికలు సమర్పించాలన్నారు. గ్రామసభలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి, నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.