Close

దరఖాస్తుదారుడు సంతృప్తి చెందేలా పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 12/03/2025

ఏలూరు, మార్చి , 12 : దరఖాస్తుదారుడు సంతృప్తి చెండులా పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం విధానం ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తహసీల్దార్ లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యే, తదితర ప్రజాప్రతినిధుల నుండి అందిన దరఖాస్తుల పరిష్కార అంశంపై ఆర్డీఓ, తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. పేదప్రజలు పిజిఆర్ఎస్ లో తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తుంటారని, వాటికి అర్హత కలిగిన ధరఖాస్తులలో ఫిర్యాదీదారుడు సంతృప్తికరమైన రీతిలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, తదితరాల వారి వద్ద నుండి అందిన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్హత లేని దరఖాస్తులను తిప్పి పంపుతూ అందుకు గల కారణాలను స్పష్టంగా ధరఖాస్తుదారునికి, సదరు ప్రజాప్రతినిధికి తెలియజేయాలన్నారు. దరఖాస్తు అందిన తరువాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారా , పరిష్కార విధానం, అధికారుల ప్రవర్తన, తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫిర్యాదీదారుడితో ఐవిఆర్ఎస్ విధానంలో ఫోన్ ద్వారా ప్రజల స్పందనను అడిగి తెలుసుకుంటారని, అధికారుల ప్రవర్తన, నడవడిక, జవాబుదారీతనం తదితర అంశాలను కూడా అడిగి తెలుసుకుంటారన్నారు. భూ వివాదాల పరిష్కారంలో రెవిన్యూ అధికారులు నిబంధనల ననుసరించి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం మండల రెవిన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారి సమస్యను సావధానంగా వినాలన్నారు.
రెవిన్యూ చట్టాలపై తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలిగిఉండాలని, తాను మండల పర్యటనలలో తహసీల్దార్ కార్యాలయం, ఇతర మండల కార్యాలయాలను సందర్శించి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కార విధానాన్ని పరిశీలిస్తామన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరన్ రాజ్, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డిసి భాస్కర్, జిల్లాలోని అన్ని మండలాలాల తహసీల్దార్లు, పాల్గొన్నారు.