Close

జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి..

Publish Date : 15/03/2025

ఏలూరు, మార్చి, 15: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం త్రాగునీరు, వడగాల్పులు, పదోతరగతి పరీక్షలు నిర్వహణ, పి-4 సర్వే తదితర అంశాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు తదితరులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవిలో వడగాల్పులు, ఎండలు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నీటిఎద్దటి లేకుండా మున్సిపల్ కమీషనర్లు, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరమైన చోట చలివేంద్రాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాలను గుర్తించాలన్నారు. కలెక్టరేట్ లో త్రాగునీటిని పరిక్షింపచేయాలని చలివేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలలు ఎంతో కీలకమని, ముందే త్రాగునీటి సరఫరా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్ డబ్ల్యూఎస్, ఈవోపిఆర్డిలు తమ పరిధిలో ఉన్న త్రాగునీటి వనరులపై పూర్తి సమాచారం కలిగివుండాలన్నారు. త్రాగునీటి సరఫరాలపై ఎక్కడా ప్రతికూల వార్తలు రాకూడదని స్పష్టం చేశారు. వడగాల్పులను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ పిల్లలకు, విద్యార్ధుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పిడి పి. శారద, డిఇఓ వెంకటలక్ష్మమ్మను కలెక్టర్ ఆదేశించారు. ఎండలో పిల్లలు ఉండకుండా ఆయా తరగతి గదుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పులు, ఎండతీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేయడంతోపాటు వడగాల్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇందుక సంబంధించి ప్రజలు చేయదగినవి, చేయకూడనివి అంశాల వారీగా క్షేత్రస్ధాయిలో అవగాహన పరచాలన్నారు. ముఖ్యంగా ఉపాధిహామీ పనుల్లో పాల్గొనే కార్మికులకు త్రాగునీరు, నీడను కల్పించే చర్యలు తీసుకోవాలని డ్వామా పిడి సుబ్బారావును కలెక్టర్ ఆదేశించారు. సిసి రోడ్లు, తదితర నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులకు సచివాలయ సిబ్బంది, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించాలన్నారు. పర్యాటక ప్రాంతాలైన దేవాలయాలు, తదితరరాల వద్ద త్రాగునీటీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు కూడా ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వడగాల్పులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుతీసుకనేలా సంబంధిత యాజమాన్యాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం పి-4 సర్వేపై కలెక్టర్ సమీక్షిస్తూ సర్వేను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

పదోతరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి..

జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. పేపరు లీకేజీలు వంటివి జరుగకుండా పటిష్ట భధ్రతా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా వంటి ప్రచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో సెక్షన్-163 అమలు చేయడంతోపాటు పరీక్షల సమయంలో జీరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్లు మూసివేసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆర్ టి సి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆ సమయాలను , ప్రాంతాలను పత్రికా ముఖంగా తెలియజేయాలని ఆర్ టిసి జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్ ను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆశాఖ ఎస్ఇ సాల్మన్ రాజును కలెక్టర్ ఆదేశించారు.