Close

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తికి దశలవారీగా లక్ష్యాల నిర్దేశం: సీఎం చంద్రబాబునాయుడు

Publish Date : 27/03/2025

ఏలూరు/పోలవరం, మార్చి , 27 : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు వెనుకాడబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఇందుకుగాను కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన పనులను నిర్దేశించిన సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెలాఖరుకు కాంట్రాక్టర్లకు నిర్దేశించిన పనులలో కొంతమంది కాంట్రాక్టర్లు వెనుకబడి ఉండడం, కొందరు సమావేశానికి హాజరు కాకపోవడంపై ముఖ్యమంతి స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని దీని దృష్ట్యా పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహించవద్దన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు దశలవారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డయాఫ్రమ్ నిర్మాణాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని,రైట్ మెయిన్ కెనాల్ కనెక్టవిటీ లను జులై, 2026 నాటికి పూర్తిచేయాలన్నారు. ఈ సి ఆర్ ఎఫ్ -గ్యాప్ 1 పనులను 2026 మార్చి , లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సి ఆర్ ఎఫ్ -గ్యాప్ 2 పనులను 2027 డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశించినప్పటికీ గోదావరి పుష్కరాల కంటే ముందుగానే 2027, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, జాతికి అంకితం చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్ ఏర్పాటుచేయడం, పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బట్రస్ డాం పూర్తి కి 82 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ అత్యవసర పనులు నిమిత్తం 400 కోట్ల రూపాయలు, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు అత్యవసరంగా 486 కోట్ల రూపాయలు మొత్తం 886 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇంజనీరింగ్ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, జలవనరుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశారరావు, ఆర్ అండ్ ఆర్ కమీషనర్ ఎస్. రామసుందర్ రెడ్డి, జెన్కో ఎండి చక్రధరబాబు, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, డా. కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటి డిఏ ప్రాజెక్ట్ అధికారి ఏ .సింహాచలం, పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి, మెగా కంపెనీ డైరెక్టర్ సి.హెచ్. పి . సుబ్బయ్య,ఎం ప్రభృతులు పాల్గొన్నారు.