ఏలూరు జిల్లాలో ఈ నెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె.పి .ఎస్. కిషోర్, జేసీ పి . ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.

నూజివీడు/ఏలూరు, ఏప్రిల్, 9 : ఏలూరు జిల్లాలో ఈ నెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె.పి .ఎస్. కిషోర్, జేసీ పి . ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన విధులను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. హెలీప్యాడ్ ఏర్పాట్లను రహదారులు, భవనాల శాఖ అధికారులు గురువారం ఉదయం నాటికి పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రివర్యులు శుక్రవారం ఉదయం హెలికాప్టర్ లో అగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామం విచ్చేస్తారని, అనంతరం వివిధ కులవృత్తులు సంబందించిన కుటుంబాలను వారి పని ప్రదేశంలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు. అనంతరం ప్రజావేదిక కు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, అనంతరం హెలికాప్టర్ లో వడ్లమాను నుండి విజయవాడ బయలుదేరి వెళ్తారన్నారు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రివర్యులు కార్యక్రమానికి విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. త్రాగునీటి ఎక్కడ సమస్య రాకుండా చూడాలని, ఓ.ఆర్. ఎస్., ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజావేదిక వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్హ్యమంత్రి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ కొరకు ప్రత్యేక ప్రదేశం గుర్తించి, అగిరిపల్లి గ్రామంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ కృష్ణారావు, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వివిధ శాఖలకు చెంది జిల్లా అధికారులు పాల్గొన్నారు.