Close

ఈనెల 11వ తేదీన ఆగిరిపల్లి ప్రజా వేదిక సభకు స్వచ్ఛంధంగా హాజరై విజయవంతం చేయాలి..

Publish Date : 09/04/2025

ఏలూరు/ఆగిరిపల్లి,ఏప్రిల్,09: ఈనెల 11వ తేదీన ఆగిరిపల్లిలో పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని ఈ సందర్బంగా నిర్వహించే ప్రజా వేదక సభకు ప్రజలు స్వచ్ఛంధంగా హజరై విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పిలుపునిచ్చారు. బుధవారం ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ తదితర అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక న్యాయంకోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు, సాంఘీక అరాచకాలు ఎక్కువగా ప్రభలిన రోజుల్లో కూడా ధైర్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలకోసం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ని అగిరిపల్లిలో రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పూలేగారు ఆశించిన ఆశయాలు కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బలహీన వర్గాల కుటుంబాల కోసం మంచి భవిష్యత్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో పర్యటించనున్నట్లు మంత్రి పార్ధసారధి చెప్పారు. ఆరోజు ప్రత్యేకంగా చేతివృత్తుల వారు, నాయి బ్రాహ్మణులు కానీ, గొర్రెల కాపరులు గానీ, రజకులు గానీ, తదితర కుల వృత్తులమీద ఆధారపడి జీవిస్తున్న వారి పని స్ధలాలకు వెళ్లి కుటుంబాలను పరామర్శించి వారి వృత్తుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకొని ఏ విధమైన ఆలోచన చేస్తే మేలుజరుగుతుందో తెలుసుకుని వారితో చర్చించేందుకు కొంత సమయాన్ని ముఖ్యమంత్రి కేటాయించునున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమం వద్ద ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలియపరచడం జరుగుతుందన్నారు. ఆ సభకు ప్రజలంతా స్వచ్ఛంధంగా హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్బంగా మంత్రి కొలుసు పార్ధ సారధి విజ్ఞప్తి చేశారు.
ఆదే విధంగా నూజివీడు నియోజకవర్గంలో పలు సమస్యలను గౌ. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. రిజర్వాయర్లను తలపించే పెద్ద చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నాయని వాటికి లిఫ్టు సౌకర్యం కల్పిస్తే సుమారు 25 ఎకరాలకు సాగునీటి సమస్య లేకుండా సాగుచేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఎన్ఎస్ పి కాల్వను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత రైతులకున్న హక్కులను కూడా పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయంపై తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రితో మాట్లాడి నీరురావడానికి కృషి చేశామన్నారు. అయితే ఎన్ ఎస్ పి కాలువ ను అభివృద్ధి పరిచేందుకు, మైనర్ ఇరిగేషన్ రిహాబిలిటేషన్ ప్లాన్ ను గౌ. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రహదారి వ్యవస్ధ చిన్నాభిన్నం అయిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నూజివీడు చుట్టుప్రక్కల రింగురోడ్డు ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఆయన చెప్పారు. ఆగిరిపల్లిలోని వ్వాగ్రేశ్వర నరసింహస్వామి ఆలయ అభివృద్ది విషయాన్ని గౌ. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ రాహిత్యం మూలంగా రాష్ట్రం అప్పులపాలైయిందని, దీనిని గాడిన పెట్టేందుకు గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రజా వేదిక సభ అనంతరం 5వేల మంది కార్యకర్తలతో గౌ. ముఖ్యమంత్రి సమావేశమై తగు మార్గనిర్దేశం చేస్తారని మంత్రి కొలుసు పార్ధ సారధి తెలిపారు.